- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబును ట్రాప్ చేశారా.. జగన్, మోడీ వలలో టీడీపీ అధినేత..?
పొత్తులపై కేంద్రంలోని బీజేపీ చివరి వరకు నాన్చి ఎట్టకేలకు టీడీపీ, జనసేనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిణామంతో తాము విజయం సాధించినట్లేనన్న ధీమా ఇరు పార్టీల్లోనూ కనిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు, పవన్‌తో భేటీకి ముందురోజే సీఎం జగన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఆ తరువాతే పొత్తులపై కమలనాథులు తమ నిర్ణయాన్ని ప్రకటించారు. గత ఎన్నికల వరకు 30 శాతం ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వర్గాలు ఎక్కువగా వైసీపీ వెనకే ఉన్నాయి. ఐదేళ్ల పాలన తర్వాత బీజేపీతో తెరచాటు బంధం, ఆయా వర్గాల బడ్జెట్‌ను ఊరుమ్మడి పథకాలకు వెచ్చించారనే అసంతృప్తి నెలకొంది. దీంతో ఆ వర్గాలు దూరం కాకుండా ఉండాలంటే టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు ఉండాలని జగన్ ఎత్తుగడ వేశారు. మరోవైపు గతంలోనే ఈ వర్గాలు తమవైపు లేవు కాబట్టి కొత్తగా వచ్చే నష్టమేమీ లేదని టీడీపీ కూటమి శ్రేణులు లెక్కలేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
దిశ, ఏపీ బ్యూరో: ఐదేళ్ల పాలనలో వైసీపీ సర్కారు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించింది. ఆయా సంక్షేమ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. యువత స్వయం ఉపాధి పథకాలను అటకెక్కించింది. కీలకమైన భూ కొనుగోలు పథకాన్ని సైతం ఎత్తేసింది. అంతే కాకుండా సుమారు 27 పథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందంటూ ఎస్సీ, ఎస్టీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు కేంద్ర నిధులతో అమలు చేయాల్సిన ఉపాధి కార్యక్రమాలను సైతం ఎస్సీ, ఎస్టీలకు అందించలేకపోయింది. ఇక మైనార్టీలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాలను కూడా నిలిపేసింది. వివాహాలకు అందించే ప్రోత్సాహక నగదుకు సవాలక్ష కొర్రీలు పెట్టింది. వాటి అన్నింటికీ జిందా తిలిస్మాత్ లాగే నవరత్నాలే సరిపోతాయని ప్రభుత్వం భ్రమలో పడిపోయింది. ఈ పరిణామాలతో గత ఎన్నికల వరకు వైసీపీని వెంట ఉన్న ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో అసంతృప్తి తార స్థాయికి చేరింది. ఎక్కడ ఆ వర్గాలు తమను విడిచి వెళ్లిపోతారోనని పార్టీ అధిష్టానం ఆందోళన చెందింది. తిరిగి ఆయా వర్గాలను నిలబెట్టుకోవాలంటే సరైన వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే సీఎం జగన్, ప్రధాని మోడీ పొత్తుల మంత్రాన్ని ప్రయోగించినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
వైసీపీ, బీజేపీ ఫెవికాల్ బంధం..
సీఎం జగన్ పై అక్రమాస్తుల కేసులను చూసీచూడనట్లుగా ఉండడంతో పాటు అవసరమైనంత అప్పులు ఇవ్వడానికి కేంద్రం సహకరించింది. ఢిల్లీ బాద్ షాలతో వైసీపీ కీలక నేతల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. చివరకు అక్కడ మోడీ ఆదేశిస్తారు.. ఇక్కడ జగన్ అమలు చేస్తారనే నానుడి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు సైతం నిలదీయలేనంతగా వీళ్ల మధ్య బంధం బలపడింది. బీజేపీతో వైసీపీ అనుబంధాన్ని ముస్లిం మైనార్టీ వర్గాలు జీర్ణించుకోలేక పోయాయి. ఈ దఫా వైసీపీ నుంచి దూరంగా జరగాలని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు నిర్ణయించుకున్నాయి. పరిస్థితులు చేయిదాటక ముందే ఈ వర్గాలను కాపాడుకునేందుకు వైసీపీ, ఢిల్లీ బాద్ షాలు పొత్తుల మంత్రాన్ని వాడుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేపీని వారి వైపు నెట్టిన జగన్..?
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఐదేళ్లలో మత విద్వేషాలకు ఊతమిచ్చే విధంగా వ్యవహరించడంతో ముస్లిం మైనార్టీ వర్గాల్లో తీవ్ర అభద్రతా భావం నెలకొంది. ఎన్నికల ముంగిట టీడీపీ, జనసేనలు బీజేపీని ఆలింగనం చేసుకోవడంతో తిరిగి ఈ వర్గాలు వైసీపీ వైపే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు విభజన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగా కమలనాథులు ముద్ర వేసుకున్నారు. పోర్టుల నుంచి ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ గాక విశాఖ ఉక్కును కూడా తెగనమ్మడానికి బీజేపీ సర్కారు సిద్ధమైంది. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్, ధరల పెంపుతో పాటు నిత్యావసరాలపై జీఎస్టీ బాదుడు సగటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. ఇంకా కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు సామాన్యుల దైనందిన జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. కేంద్రంపై వ్యతిరేక సెగ తనకు తగలకుండా జగన్ బీజేపీని టీడీపీ, జనసేనతో పొత్తువైపు నెట్టి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
పొత్తును ప్రజలు ఆమోదిస్తారా?
బీజేపీతో పొత్తు వల్ల తమకు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలు దూరమయ్యే అవకాశం లేదని టీడీపీ, జనసేన శ్రేణులు చెబుతున్నాయి. గతం నుంచే ఆ వర్గాలు వైసీపీ, కాంగ్రెస్ వెనకాల ఉండేవని, కొత్తగా తాము నష్టపోయేదేమీ లేదని అంటున్నాయి. రాష్ర్ట భవిష్యత్తు కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటిస్తున్నాయి. పదేళ్ల నుంచి విభజన హామీలను నెరవేర్చకుండా సామాన్యుల జీవితాలను పీల్చిపిప్పిచేస్తున్న ఎన్డీఏ సర్కారుతో రాష్ర్ట భవిష్యత్తు అంధకారమవుతుందని కాంగ్రెస్, వామపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ దఫా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి ప్రతికూలతలను ఎదుర్కొంటున్న బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తును ప్రజలు ఏమేరకు ఆమోదిస్తారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.