వైఎస్ జగన్‌తో భేటీపై డిప్యూటీ CM డీకే శివకుమార్ క్లారిటీ

by Satheesh |
వైఎస్ జగన్‌తో భేటీపై డిప్యూటీ CM డీకే శివకుమార్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర ఓటమి చవిచూసింది. 175 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగిన వైసీపీ.. కేవలం 11 సీట్లలోనే విజయం సాధించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో త్వరలోనే వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటూ అధికార కూటమి ఎమ్మెల్యేలు జగన్‌ను ఇరుకున పెడుతున్నారు. వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని.. ఈ మేరకు కాంగ్రెస్ హై కమాండ్‌తో జగన్ చర్చలు సైతం జరుపుతున్నారని టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వైఎస్ కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కర్నాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా రాయభారం నడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగన్ డీకే శివకుమార్‌తో ఓ సారి భేటీ అయ్యారని.. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

దీంతో డీకే, జగన్ భేటీ వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో జగన్‌తో భేటీ ప్రచారంపై డీకే శివకుమార్ స్పందించారు. జగన్‌తో భేటీ వార్తలను ఆయన ఖండించారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని స్పష్టం చేశారు. మేమిద్దరం భేటీ అయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఫేక్ ఫొటోలు సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని మండిపడ్డారు. నేను, జగన్ అసలు భేటీనే కాలేదని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మకండని సూచించారు. డీకే రెస్పాండ్ కావడంతో భేటీ వార్తలకు చెక్ పడింది. కాగా, కాంగ్రెస్‌లో వైసీపీని విలీనం చేస్తారంటూ ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోన్న వేళ తాను జగన్‌తో భేటీ కాలేదని కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్ క్లారిటీ ఇవ్వడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed