AP News: కమ్యూనిస్టు నేత సుందరయ్య జీవితం స్ఫూర్తి దాయకం.. సీపీఎం

by Indraja |
AP News: కమ్యూనిస్టు నేత సుందరయ్య జీవితం స్ఫూర్తి దాయకం.. సీపీఎం
X

దిశ,కుక్కునూరు: పీడిత ప్రజల ప్రియతమ నేత సుందరయ్య జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని సీపీఎం మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేంద్రరావు అన్నారు. ఆదివారం నాడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా చీరవల్లి, మాధవరం, దాచారం, కుక్కునూరు గ్రామాల్లో సీపీఎం కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆస్తిని వారసత్వంగా ఇచ్చినట్టు రాజకీయాలను కూడా ఇస్తున్నారు. తాను పదవిని అనుభవిస్తే తర్వాత కొడుకులు, కోడళ్లు, కూతుర్లు, అల్లుల్లు వాళ్ళ వాళ్లు అనుభవించాలని కాంక్షిస్తూ.. పదవులను వారికి వారసత్వంగా కట్టబెట్టి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారని, అయితే రాజకీయాల్లో సేవలు అందించిన సుందరయ్య పిల్లలు పుడితే సమాజం మీద కాకుండా వారి సంపాదనలు, ఉద్యోగాలు వాటి గురించే ఎక్కువగా తాపత్రయం పడాల్సి వస్తుంది, కాబట్టి పిల్లల్ని కనకుండా ఉండాలని ఆయన సతీమని అంగీకారంతో కుటుంబ నియంత్రణ చేయించుకున్నారని పేర్కొన్నారు.

సుందరయ్యని వీర తెలంగాణ సాయుధ పోరాట, రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడిగానే కాకుండా, గొప్ప పార్లమెంటిరియన్, 17 సంవత్సరాలు పాటు ఆయన ఎమ్మెల్యేగా శాసన సభలో ఉన్నారని గుర్తు చేశారు. ఐదు సంత్సరాల పాటు ఎంపిగా పార్లమెంట్‌లో ఉన్నారని తెలిపారు. పార్లమెంట్‌కు,శాసన సభకు సైకిల్ మీద వెళ్ళారని, ప్రధాన మంత్రి వద్దకు సైకిల్‌కి ఫైల్స్ కట్టుకుని తిరిగారని.. ఆ రకంగా శాసన సభలో కూర్చున్న వారు ఏరకంగా ఉండాలో ఆదర్శ ప్రాయంగా చూపారని అన్నారు.

అటువంటి ఆదర్శవంతమైన జీవితం గడిపిన వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు. ఇప్పుడు అసంబ్లీలో ఒకరిమీద ఒకరు దాడి చేసుకుంటూ, అసభ్యకరమైన పదాజాలంతో తిట్టుకుంటున్న రాజకీయ పార్టీలు, నాయకులు మొత్తం రాజకీయ వ్యవస్థని బ్రష్టు పట్టిస్తున్న ప్రతి ఒక్కరు సుందరయ్యను ఆదర్శంగా తీసుకుని ఇకనైనా మారాలని నాగేంద్రరావు అన్నారు.

సుందరయ్య స్పూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగిద్దాం అని, అందుకు ప్రతి ఒక్కరు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు యర్నం సాయికిరణ్, మేడిపల్లి బాబు, కోట రామలక్ష్మి, పట్ల లక్ష్మయ్య, షేక్ వలిపాషా, పార్టీ సభ్యులు కోట మోహన్ రావు, మహబూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.



Next Story