నెల్లూరు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి

by sudharani |
నెల్లూరు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి
X

సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినితీ రాజ్యమేలుతోంది. ఫైల్ ముందుకు కదలాలంటే దేవుడికంటే ముందు పూజారిని ప్రసన్నం చేసుకోవాల్సి వస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల హవా కొనసాగుతోంది. ఏజెంట్లు చెప్పిందే వేదంగా మారుతోంది. ముడుపులిస్తే చాలు ఎలాంటి ఫైల్ అయినా చకాచకా పరుగులు పెడుతోంది.

దిశ, నెల్లూరు: నెల్లూరు నగరంలో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అన్ని డాక్యుమెంట్‌‌లు సక్రమంగా ఉన్నా సరే పని త్వరగా జరగాలంటే రూ.10 వేలు నుంచి రూ.30 వేల వరకు ముడుపులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంకా పెద్ద రిజిస్ట్రేషన్‌లకైతే లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు రిజిస్ట్రార్‌లే ఉన్నా కింద ప్రైవేట్‌గా పని చేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకునే ముందు వీరిని కలిస్తే చాలు సజావుగా సాగుతుంది. లేదంటే బోలెడన్నీ కొర్రీలు పడుతుంది. ఇంత అవినీతి జరుగుతున్నా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు.

డాక్యమెంట్ రైటర్లదే హవా

నెల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిష్టర్ల కన్నా రైటర్లదే హవా ఎక్కువ. రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపంలో రైటర్లుగా ఉన్న ఏజెంట్లు ఆఫీసులను ఏర్పాటు చేసుకుని అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఎకరాకు ఒక రేటు ఫిక్స్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏ ఫైల్ ముందుకు వెళ్లాలో.. ఏ ఫైల్ ఆపాలో వీరే నిర్ణయిస్తున్నారు. వచ్చిన మొత్తంలో వాటాలు పంచుకుంటున్నారు.

నిబంధనలు బేఖాతరు

ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలకు అడ్డకట్ట వేసేందుకు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే డిజిటల్‌ స్టాంపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిటల్‌ స్టాంపుల విక్రయాలు జరిగే కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్‌, యూజర్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే సౌలభ్యం కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ చార్జీలను వినియోగదారులు డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా బ్యాంకు చలానాల రూపంలో చెల్లిస్తున్నారు. ఇంత పాదర్శకంగా ఉన్నప్పటికీ రిజిస్టర్లు ఏమాత్రం తగ్గకుండా మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని యథావిధిగా తమ దందా కొనసాగిస్తున్నారు.

ఆంక్షలున్నా అడ్డులేదు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్ల సహా అనధికార వ్యక్తుల్ని ఎంట్రీ లేదు. వారి ప్రవేశాన్ని నిషేధించినట్టు ప్రభుత్వ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘించి కార్యాలయాల్లోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే ఈ నిబంధలను నెల్లూరు రిజిస్ట్రేషన్ శాఖకు మాత్రం వర్తించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed