పులివెందుల తరువాత అదే ముఖ్యం... ప్రత్యర్ధి సరైనోడు కావడంతో వైసీపీలో కలవరం

by Disha Web Desk 16 |
పులివెందుల తరువాత అదే ముఖ్యం... ప్రత్యర్ధి సరైనోడు కావడంతో వైసీపీలో కలవరం
X
  • కార్యనిర్వాహక రాజధాని ఇక్కడే.. నేతలకు వేల కోట్ల ఆస్తులు
  • గంటా ప్రత్యర్ధిగా దిగడంతో వైసీపీలో కలవరం
  • టార్గెట్ కోసం రంగంలోకి దిగిన అధికారులు

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: భీమునిపట్నం... దేశంలోనే రెండవ మున్సిపాలిటీగా గౌరవం దక్కొంచుకొన్న ఈ పట్టణం చారిత్రక ప్రాంతమే కాదు, అధికార వైసీపీకి అత్యంత ముఖ్యమైన పట్టణం కూడా. రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పోటీ చేసే పులివెందుల తరువాత ఆ పార్టీకి కావాల్సిన, కోరుకొంటున్న నియోజకవర్గం ఇది. ఇక్కడ ఎలా అయినా గెలవాలన్న తలంపుతో అన్ని రకాల ప్రయాత్నాలను అధికార పార్టీ చేస్తోంది. చివరకు అధికారులను కూడా రంగంలోకి దించి తమను ఇబ్బందులకు గురిచేయడం పట్ల కూటమి పక్షాలు ఏకంగా ఎన్నికల కమిషన్‌కే ఫిర్యాదు చేశాయి.

కార్యనిర్వాహక రాజధాని.. భోగాపురం దారి..

వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులలో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించింది. ఆ రాజధాని ప్రాంతం భీమిలి నియోజకవర్గం పరిధిలోనే ఉంటుందని మంత్రులు పదే పదే ప్రకటించారు. చివరకు ముఖ్యమంత్రి తన కార్యాలయం కోసం రుషికొండను విధ్వంసం చేసి కట్టిన భవనాలు కూడా భీమిలి పరిధిలోనే వున్నాయి. కొత్తగా కడుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఈ నియోజక వర్గానికి అనుకొనే వుంటుంది. అక్కడకు వెళ్లేందుకు వేస్తున్న నాలుగులైన్ల రహదారి 80 శాతం ఈ నియోజక వర్గంలోనే ఉంది.

కూడబెట్టిన వేల కోట్ల ఆస్తులు ఇక్కడే..

ఈ ఐదేళ్ల కాలంలో ఉత్తరాంధ్ర ఇంచార్జిగా పని చేసిన విజయసాయి రెడ్డి నేత్రుత్వంలో సెటిల్‌మెంట్లు చేసిన, కూడబెట్టిన వేల కోట్ల రూపాయల స్ధలాలు ఈ నియోజక వర్గంలోనే ఉన్నాయి. గతంలో అప్పటి ప్రభుత్వాలు మాజీ సైనికోద్యోగులకు, స్వాతంత్ర సమరయోధులకు కేటాయించిన వేల ఎకరాల భూములు ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. పలు సంస్ధలకు ప్రభుత్వం ద్వారా, వుడా ద్వారా కేటాయించిన వేలాది ఎకరాలు ఇక్కడే వున్నాయి. కోనుగోళ్లు, అమ్మకాలకు ఎన్‌ఓ‌సీ‌లు అవసరమైన, ప్రభుత్వ అనుమతులు అవసరమైన ఈ భూములను వందల ఎకరాల్లో వైసీపీ నేతలు హస్తగతం చేసుకొన్నారనే ఆరోపణలున్నాయి. 70 ఎకరాల ఎన్సీ‌సీ భూమి, 33 ఎకరాల రేడియంట్ భూములు, 12 ఎకరాల హయిగ్రీవ భూముల వంటివెన్నో ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతల పరమయ్యాయి. ఇప్పుడు ఎం ఎల్ ఏ మారితే వాటి పరిస్ధితి ఏమిటన్న ఆందోళన వైసీపీ పెద్దలను వెంటాడుతోంది.

గంటాతో తంటానే..

గతంలో నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించి బలమైన క్యాడర్ ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం నుంచి పోటీలో దిగారు. ప్రస్తుత వైసీపీ శాననసభ్యుడు, అభ్యర్ధి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాస్ గంటా ముందు తేలిపోతున్నారు. 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఓటమన్నదే లేని వ్యూహకర్తగా పేరొందిన గంటా డబల్ హ్యాట్రిక్ కోసం శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్వే నివేదికలన్నీ గంటాకు అనుకూలంగా రావడం, భీమిలిలో వచ్చే మెజారిటీ విశాఖ ఎంపీని విజయాన్ని నిర్దేశించే పరిస్ధితులు వుండడం వైసీపీని కలవరపెడుతోంది. వైసీపీ ఎంపీగా బొత్స ఝాన్సీ పోటీకి దిగడంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఇక్కడే మకాం వేసి పని చేస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.

రంగంలోని నార్త్ ఏసీపీ సునీల్..

దీంతో అత్యంత వివాదాస్పదుడైన విశాఖ నార్త్ ఏసీపీ సునీల్‌ను రంగంలోకి దింపారు. ఆయన వైసీపీకి పనిచేయడంతో పాటు ,క్రింది స్ధాయి సీఐలు, ఎస్ఐలపై కూటమిని నేతలను వేధించాల్సిందిగా, అడ్డుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకురావడంతో టీడీపీ మరో ప్రత్యామ్నాయం లేక ఆయనను విధుల నుంచి తప్పించాల్సిందిగా బుధవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. డీ‌ఎస్‌పీ హోదాలో మొదట కడపలో పని చేసిన ఆయన వివేకా హత్య కేసులో దర్యాప్తు వివరాలను కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అందించేవారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారని, ఆ తరువాత మూమూళ్ల కోసం వందకు పైగా క్వారీలున్న అనకాపల్లికి సింగిల్ డీవోతో వచ్చారని పేర్కోన్నారు. అనకాపల్లిలో గంజాయితో దొరికిన కారును కోర్టుకు అప్పగించకుండా నిబంధనలకు విరుద్దంగా సునీల్ వాడుకొంటూ విశాఖలో పోలీసులకు దొరికిపోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. సస్పెండ్ చేయాల్సిన సమయంలో అవినాష్ మద్దతుతో లూప్ లైన్‌లో వేసి తరువాత అత్యంత కీలకమైన భీమిలికి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసుకువచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సునీల్ కుమారుడికి వైసీపీ భారీ సాయం?

అంగవైకల్యంతో బాధపడే తన కుమారుడి వైద్యం కోసం పది రోజులక్రితం నియోజక వర్గ పరిధిలో జరిగిన సోషల్ మీడియా సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి సిఫార్సుతో ముఖ్యమంత్రి జగన్ పార్టీనుంచి కోటి రూపాయల సాయాన్ని కూడా ప్రకటించారని అందులో ఆరోపించారు. వైసీపీ నుంచి ఇంతగా లబ్ధిపొందిన అవినాష్ రెడ్డి శిష్యుడైన సునీల్‌ను తప్పించాలని టీడీపీ డిమాండు చేసింది. వైసీపీ పట్టుబట్టి కొనసాగిస్తున్న ఆర్డీవో భాస్కర రెడ్డిపైనా విచారణ జరపాలని కూటమి పక్షాలు కోరుతున్నాయి. వైసీపీపై వచ్చే ఫిర్యాదులను భాస్కర రెడ్డి పక్కన పడేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Next Story

Most Viewed