నేడు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం... నేతలకు దిశానిర్దేశం

by Javid Pasha |   ( Updated:2023-10-31 06:40:21.0  )
నేడు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ కీలక సమావేశం... నేతలకు దిశానిర్దేశం
X

రానున్న ఎన్నికలపై సీఎం జగన్ పార్టీకి మరోసారి దిశానిర్దేశం చేయనున్నారు. మంగళవారం ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో సమావేశమవుతున్నారు. 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారట. అనుకూల ఓట్ల చేర్పులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ కో-ఆర్డినేటర్ల నియామకం, పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. నిజంగా జనమంతా ప్రభుత్వ తీరు పట్ల సంతృప్తిగా ఉన్నారా? అసలు ధైర్యంగా నోరు విప్పే పరిస్థితులున్నాయా! సీఎం సభలకు సైతం ప్రజలను బలవంతంగా ఎందుకు తరలించాల్సి వస్తోందంటూ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓటర్లపై మునుపెన్నడూ లేనంతగా నిర్బంధం కొనసాగుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో:సాగు నీరందక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకావడం లేదు. ఎవరికి తోచిన విధంగా వాళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలంలో రహదారికి అడ్డంగా ఓ చెట్టును కొట్టేసి ట్రాఫిక్‌ను నిలిపేశారు. మొన్నటికి మొన్న బాపట్ల జిల్లాలో రైతులు మెడకు ఉరితాడు తగిలించుకొని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వర్షాభావం, కరవు పరిస్థితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గగ్గోలు పెడుతున్నారు. వీళ్లంతా ఏదో ఒక సంక్షేమ పథకం లబ్ధిదారులే. అయినంత మాత్రాన వీళ్లంతా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నట్లా? అనేది అధికార పార్టీ యంత్రాంగానికే తెలియాలి.

లబ్ధిదారులపై అధికారుల ఒత్తిడి

సీఎం జగన్ ఎక్కడ సభలు నిర్వహించినా ప్రజలను తరలించే విషయంపై అధికారులకు తల బొప్పికడుతోంది. వలంటీర్ల దగ్గర నుంచి ఉన్నతాధికారుల దాకా పథకాల లబ్ధిదారులపై తీవ్రంగా ఒత్తిడి చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల సభకు రాకుంటే పథకాలు నిలిపేస్తామనే అర్థంతో బెదిరింపులకు దిగాల్సి వస్తోంది. ఇటీవల పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు జనాన్ని తరలించడానికి నిర్వాహకులు నానా తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకుంటున్న నిమ్న వర్గాల్లో ఇంకా అసంతృప్తి ఎందుకు నెలకొందో సీఎం జగన్‌కు తెలీదా? అంటూ ఆయా సామాజిక వర్గాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉత్తుత్తి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాయ చేస్తున్నట్లు ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు సైతం సమాధానం చెప్పలేక మౌనం వహిస్తున్న పరిస్థితులున్నాయి.

నిధుల మంజూరులో మంత్రులకు స్వేచ్ఛ కరువు?

ఎవరు అవునన్నా.. కాదన్నా గత ప్రభుత్వ హయాం నుంచే అధికార కేంద్రీకరణ మరింత వేగమైంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారు. కేవలం ఆయా సామాజిక వర్గాల్లో ప్రచారానికే పరిమితం కావాల్సి వస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ధోరణి మరింతగా ప్రబలింది. నిధులన్నీ సీఎం చేతుల్లో పెట్టుకున్న దాఖలాలు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో లేదు. గతంలో కనీసం ఆ శాఖల పరిధిలో మంత్రులకు కొంచెమైనా స్వేచ్ఛ ఉండేది. దీంతో వాళ్ల నాయకత్వాన్ని ఆయా వర్గాల ప్రజలు గుర్తించేది. ఇప్పుడు కేవలం వాళ్లను ఆయా కులాల్లో ప్రచారానికే పరిమితమవుతున్న పరిస్థితులు దాపురించాయి.

కొనసాగుతున్న ఓటర్లపై నిర్బంధం

గతంలో ఎన్నడూ లేనంతగా ఓటర్లపై ప్రభుత్వ నిర్బంధం కొనసాగుతోంది. ఇటీవల కొన్ని సర్వే సంస్థలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించే పరిస్థితుల్లేవని స్పష్టం చేశాయి. నోరు తెరిస్తే ఎక్కడ పథకాలు నిలిపేస్తారోనన్న ఆందోళనకు గురవుతున్నారు. అధికార పార్టీ దృష్టిలో వ్యతిరేకులుగా ముద్ర పడడం ఇష్టం లేక మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లపై అక్కడక్కడా దాడులు కూడా చోటుచేసుకుంటున్నాయి. అందుకే ప్రజలు నివురుగప్పిన నిప్పులా ఎక్కడా బయటపడడం లేదు. ఇవన్నీ అధికార పార్టీకి తెలిసినా అంతా బావుందనే మైండ్‌ గేమ్‌తో ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ పరిణామాలన్నీ ఎక్కడకు దారితీస్తాయో అంచనాకు అందడం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed