డెవలప్‌మెంట్ చేస్తాం.. పెట్టుబడులు తెస్తాం: చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-10-16 13:24:06.0  )
డెవలప్‌మెంట్ చేస్తాం.. పెట్టుబడులు తెస్తాం: చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: '1 ఫ్యామిలీ - 1 ఎంట్రప్రెన్యూర్‌' అనే నినాదంతో తమ కొత్త ఇండస్ట్రియల్ పాలసీలు ఉంటాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉద్యోగాలు చేయటం కాదని, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని ఆయన ఆకాక్షించారు. కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇండస్ట్రీస్‌పై హామీ ఇచ్చామని, ఈ మేరకు డెవలప్మెంట్ చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తామని, సంపద పెంచుతామని హామీ ఇచ్చారు. పెంచిన ఆదాయం పేదలకు సంక్షేమం రూపంలో అందిస్తామన్నారు. సాంకేతికత, కొత్త టెక్నాలజీలను జోడించి తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. నాశనమైన ఏపీ బ్రాండ్‌ని మళ్ళీ బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పని చేస్తామని చంద్రబాబు తెలిపారు.

‘‘నాలెడ్జ్ ఎకానమీ, అగ్రో, ఆక్వా, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ అనేవి మన రాష్ట్రానికి ఉన్న బలాలు. జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ (ZBNF)ని ఇంకా ఎక్కువ ప్రమోట్ చేస్తాం. MSMEలని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం. ప్రతి కుటుంబం ఒక చిన్న తరహా పరిశ్రమ పెట్టేలా ప్రోత్సహిస్తాం. అందుకోసం వారికి తగు శిక్షణ, సాయం చేస్తాం. రాయలసీమకి చాలా సానుకూలతలు ఉన్నాయి. సీమలో ల్యాండ్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, కరెంటు ఉంది. ఆటోమొబైల్ హబ్‌గా రాయలసీమను తీర్చిదిద్దుతాం. సోలార్, విండ్ ఎనర్జీని కూడా ప్రమోట్ చేస్తాం. ఇవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ, సీమని నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేలా ప్రోత్సహిస్తాం.’’ అని చంద్రబాబు తెలిపారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, భావనపాడు పోర్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 10 వేల ఎకరాలలో ఇండస్ట్రియల్ హబ్ తీర్చిదిద్దుతామన్నారు. విశాఖని బెస్ట్ సిటీగా, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మార్చుతామని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed