Tirupati: గగనయాన్ తరహాలో సముద్రయాన్

by srinivas |
Tirupati: గగనయాన్ తరహాలో సముద్రయాన్
X

దిశ, ఏర్పేడు: గగన్ యాన్ తరహాలో సముద్రయాన్‌కు భారత శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారనీ, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ రవిచంద్రన్ పేర్కొన్నారు. డీప్ ఓషన్ టెక్నాలజీ మిషన్‌లో భాగంగా సముద్ర వనరులు, సముద్ర గర్భంలోని జీవ వైవిధ్యంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు ఆయన వివరించారు. తిరుపతి ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞానభారతి సంయుక్తంగా తిరుపతి ఐఐటీలో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్‌పై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో డాక్టర్ రవిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ముగ్గురు అక్వానాట్స్‌తో ప్రయాణం చేయడానికి అనువైన జలాంతర్గామిని ఈ పరిశోధనకు సిద్ధం చేస్తున్నట్లు డాక్టర్ రవిచంద్రన్ పేర్కొన్నారు. అంతేకాకుండా సముద్ర జల చరాలను గుర్తించడమే కాకుండా వాటి పరిరక్షణకు డీప్ సీ డ్రైవర్సిటీ పరిశోధన జరుగుతుందన్నారు. ఆయిల్ అండ్ గ్యాన్, మెటల్స్ వంటి సముద్ర ఆర్థిక వనరులను సమగ్రంగా గుర్తించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. భారత ఆర్థిక వృద్ధి రేటులో 4 శాతం బ్లూ ఎకానమీ ద్వారా సమకూరుతున్నట్లు రవిచంద్రన్ వివరించారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన నీతి ఆయోగ్ మెంబర్, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ కే సారస్వత్ మాట్లాడుతూ, సమాజ స్థితి గతులను సైన్స్ మారుస్తుందన్నారు. స్థిరమైన సమాజం కోసం శాస్త్ర సాంకేతిక రంగాని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. టెక్నాలజీ ద్వారా సంపదను సృష్టించుకోవాలని సూచించారు. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ బికే దాస్ డీఆర్డీవో సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భారత రాడార్లు, ఆయుధాల సామర్థ్యాన్ని వివరిస్తూ టెక్నాలజీ వృద్ధి కోసం డీఆర్డీవో చేస్తున్న కృషిని వివరించారు.

శాంతాబయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ, జ్ఞానం లేని విద్య, మానవత్వం లేని మనిషి వ్యర్థమన్నారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ను తయారు చేసిన నేపథ్యాన్ని వివరిస్తూ, కష్టాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ సత్ఫలితాలను సాధిస్తారన్నారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ తన స్వాగతోపన్యాసంలో ఐఐటీ గురించి వివరించారు.

పరిశోధనలను పెంచేందుకు జరుగుతున్న కషిని వివరించారు. తిరుపతి ఐఎస్ టీ ఎఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ డి నారాయణరావు మాట్లాడుతూ, సైన్స్ అండ్ టెక్నాలజీ పై విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లకు సమగ్రమైన అవగాహన కల్పించడమే కాకుండా తగిన ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఐఎస్ఎఫ్ను ప్రారంభించామన్నారు. ఈ వేదిక ద్వారా పరిశోధనల అవకాశాలను మెరుగుపర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఐటి డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, విజ్ఞానభారతి ప్రతినిధి త్రిస్టా ఠాకూర్, ఐఎన్టిఎఫ్ కార్యదర్శి టి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story