నిర్వాసితులను నీటిలో ముంచిన జగన్.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్

by Javid Pasha |
నిర్వాసితులను నీటిలో ముంచిన జగన్.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్
X

దిశ, తిరుపతి: రాష్ట్ర ప్రజల జీవనాఢీ పోలవరం నిర్మాణం పూర్తి చేయడం ప్రశ్నార్ధకమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు 150 అడుగులు ఎత్తు నిర్మాణం జరగాల్సి ఉందని, 45.72 వరకు ఎత్తు తగ్గించి నిర్మాణం చేస్తే ప్రయోజనం ఉండదన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అదే ఎత్తును కొనసాగించారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి జాతీయ ప్రాజెక్టు ఖర్చులు కేంద్రానికి తగ్గించడానికి చూస్తున్నారన్నారు. కేంద్రం కుట్ర పూరిత నిర్ణయంపై జగన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆయన చేతకాని తనం, పిరికితనం వల్ల పోలవరం పూర్తి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రజల జీవనాడి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. జగన్ రెడ్డి అమరావతిని ధ్వంసం చేయడమే కాకుండా పోలవరం అభివృద్ధికి చేతులెత్తేస్తున్నారు. కేంద్ర క్యాబినెట్లో ఆమోదం జరగాలని సాకులు చెప్పి గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు. 150 అడుగులు ఎత్తు ఉంటే 194 టీఎంసీలు నీటి నిలువ ఉండే అవకాశం ఉందన్నారు. తద్వారా ఉత్తరాంధ్ర రాయలసీమ, కోస్తాలకు నీరు అందే అవకాశం ఉంటుందన్నారు.దీంతోపాటు 940 మెగావాట్లు విద్యుత్ శక్తి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

ముంపు నిర్వాసితులకు దొంగ మాటలు చెప్పి పరిహారం కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న ఏలూరులో రైతు సంఘాలు, ఇరిగేషన్ నిపుణులు, రైతు సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలను ఎండగట్టేందుకు కార్యచరణ రూపొందిస్తామని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు వస్తున్నాయన్నారు. మరో 17 కాలేజీలు ఏర్పాటు చేస్తామని నేపథ్యంలో ప్రస్తుతానికి 150 సీట్లు ఉంటే అందులో 22 సీట్లు సెంట్రల్ కోటా కింద పోతే మిగతా 128 సీట్లు రిజర్వేషన్లు పాటించకుండా ఇస్టాను రాజ్యంగా కేటాయింపులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో వివిధ రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు నిరంకుశ పాలనను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టామని తెలిపారు. ఈనెల 17వ తేదీ వైజాగ్ లో ప్రారంభం అయ్యే బస్సు యాత్ర సెప్టెంబర్ 8 వరకు కొనసాగుతుందని తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీ ముగింపు సందర్భంగా తిరుపతి నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాక్రిష్ణ, నగర కార్యదర్శి విశ్వనాధ్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి నదియా పాల్గొన్నారు.

Advertisement

Next Story