చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. నేటితో ముగియనున్న రిమాండ్

by Javid Pasha |   ( Updated:2023-10-05 02:53:01.0  )
చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. నేటితో ముగియనున్న రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు విధించిన రిమాండ్ నేటితో ముగియనుంది. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు రెండోసారి అక్టోబర్ 5 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. నేటితో గడువు ముగియడంతో చంద్రబాబును వర్చువల్ విధానంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మందు సీఐడీ అధికారులు హాజరుపర్చే అవకాశముంది.

మొదటిసారి 14 రోజుల పాటు చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు అధికారులు తరలించారు. ఆ తర్వాత సీఐడీ అధికారులు కస్టడీ పిటిషన్ వేయగా.. దీనిపై వాదోపవాదనలు జరిగాయి. అనంతరం చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రెండు రోజుల పాటు చంద్రబాబును సీఐడీ అధికారులు జైల్లోనే ప్రశ్నించారు. మొదటి రిమాండ్ ముగిసిన తర్వాత బాబును వర్చువల్‌గా ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపర్చగా.. రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించారు.

తనపై నమోదైన కేసును కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో.. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. సుప్రీంలో ఇటీవల వాదనలు జరగ్గా.. తదుపరి విచారణ అక్టోబర్ 9కు వాయిదా పడింది. మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. నేడు కూడా దీనిపై విచారణ జరగనుంది. చంద్రబాబుకు కోర్టుల్లో ఊరట లభిస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed