నా శేష జీవితం దానికే అంకితం: Chandrababu

by srinivas |   ( Updated:2023-04-13 15:23:00.0  )
నా శేష జీవితం దానికే అంకితం: Chandrababu
X

దిశ, డైనమిక్ బ్యూరో: రామరాజ్యం అంటే నందమూరి తారకరామారావే గుర్తొస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్టీఆర్ చనిపోలేదని..ఎప్పటీకి మనలోనే ఉంటాడని ఆయన తెలిపారు. పేదరిక నిర్మూలనకు కంకణబద్ధుడైన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆయన ప్రారంభించిన అనేక సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా చంద్రబాబు వాళ్లనుద్దేశించి ప్రసంగించారు. మహనీయుడు పుట్టిన నిమ్మకూరు అభివృద్ధికి, ఆప్రాంత అభివృద్ధికి ఒక కాన్సెప్ట్ తయారు చేసి, మే28 నాటికి అమలుచేస్తామని హామీ ఇచ్చారు. మే28న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రపంచం కనీవినీ ఎరుగనిరీతిలో నిర్వహిస్తామన్నారు. తెలుగుప్రజలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో అర్థిక అసమానతలు తొలగించేందుకు ఎన్టీఆర్ స్ఫూర్తితో తన శేషజీవితాన్ని అంకితం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. యుగపురుషుడు స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం మనందరి పూర్వజన్మ సుకృతమన్నారు. చరిత్ర ఉన్నంతకాలం నిమ్మకూరు పేరు నిలిచి ఉంటుందని చంద్రబాబు కొనియాడారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఎన్టీఆర్ జననం, విద్యాభ్యాసం, వివాహం సినీరంగంలోకి ప్రవేశించినటువంటి అంశాలను చంద్రబాబు పంచుకున్నారు. ఎన్టీఆర్ చనిపోయి 30 ఏళ్లు అవుతున్నా... ఆయన మనలోనే ఉన్నాడని, ఏదైనా పని ప్రారంభించే ముందు ఎన్టీఆర్ విగ్రహాన్ని చూసి ప్రారంభిస్తే మనకు విజయం తధ్యమని చంద్రబాబు వెల్లడించారు.

పేదల ఆకలి తీర్చిన దేవుడు ఎన్టీఆర్

ఎన్టీఆర్ వచ్చాకే రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకున్నాయని, విప్లవాత్మక నిర్ణయాలతో దేశరాజకీయాలనే తిరగరాసిన గొప్పవ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. పేదరికాన్ని తొలుత గుర్తించి, దానినిర్మూలనకు కంకణబద్ధుడైన వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రసంసించారు. అసాధ్యం అనుకున్న రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని అమలు చేసి, పేదల ఆకలి తీర్చిన దేవుడు ఎన్టీఆర్ అని చెప్పారు. ‘పేదలకు ఒంటినిండా బట్టలుండాలన్న గొప్పఆలోచనతో జనతావస్త్రాల పంపిణీ ప్రారంభించి, చేనేతకార్మికులకు ఉపాధికల్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఏ పని చేసినా, ఆలోచించినా దానివెనుక గొప్ప పరమార్థం ఉంటుంది. సినీ రంగంలో 33 ఏళ్లు రారాజుగా వెలిగిన ఎన్టీఆర్‌కు వాస్తవంగా రాజకీయాలు అవసరంలేదు. కానీ తనను ఆదరించి, తనకు పేరుప్రఖ్యాతులు అందించిన ప్రజలకోసం ఏదో చేయాలన్న తలంపుతో, సామాజిక బాధ్యతను గుర్తించి రాజకీయాల్లోకి వచ్చారు.’ అని గుర్తు చేశారు.

‘పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి నేషనల్ ఫ్రంట్‌తో దేశరాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రధానుల్ని నియమించే స్థాయికి వెళ్లారు. పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఒకప్రాంతీయపార్టీ పని చేసింది’. అని గుర్తు చేశారు. ‘దివి సీమ తుఫాన్ వచ్చిన సమయంలో బాధితుల్ని ఆదుకోవడానికి జోలెపట్టిన నాయకుడు ఎన్టీఆర్. అదీ ఆయనకున్న సామాజిక బాధ్యత. రాయలసీమలో కరువు వచ్చినా, చైనాతో యుద్ధంవచ్చినా ప్రజల్ని ఆదుకోవడానికి నడుం బిగించారు. రాజ కీయాల్లో ఆయన 13 ఏళ్లే ఉన్నారు. కానీ ఎవరూ చేయని విధంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు.’ అని కొనియాడారు.

నిమ్మకూరు గడ్డకు ఏదో మహత్యం ఉంది

ఎన్టీఆర్ స్ఫూర్తి, ఆలోచనావిధానం, సిధ్ధాంతాలు అమలు చేస్తే సమాజంలో ఎవరికీ తిరుగుండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఒక సమావేశం నిర్వహించామని చెప్పారు. నేడు ఆయన పుట్టిన గడ్డపై రెండో సమావేశం నిర్వ హిస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా 100 సమావేశాలు నిర్వహించబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌ను ఆయన కుమార్తె భువనేశ్వరి నిర్వహిస్తున్నారని తెలిపారు. బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రి నిర్వహణ చూస్తున్నారని చెప్పారు. నిమ్మకూరుకి అవసరమైన అన్ని పనులు చేశామన్నారు. ఈ గ్రామాన్ని లోకేశ్ దత్తతతీసుకొని అభివృద్ధి చేశారన్నారు. అవికాకుండా మహిళాసాధికారత కోసం ప్రత్యేకప్రాంగణం ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ నేలపైనే త్రిపురనేని రామస్వామి చౌదరి, భోగ రాజు పట్టాభిసీతారామయ్య, పింగళి వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి మహానుభావులు జన్మించారని గుర్తు చేశారు. ‘తిరుపతి వేంకటకవులు నడయాడిన నేల ఇది. కళామతల్లి ముద్దుబిడ్డలు ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇక్కడి వారే. ఘంటసాల పుట్టిన ప్రాంతం ఇదే. గోరా, డాక్టర్ కే.ఎల్.రావు, కాకాని వెంకటరత్నం, కైకాల సత్యనారాయణ, మండలి వెంకటకృష్ణారావు, కోనేరు రంగారావు వంటి వారు ఇక్కడి వారే. ఈనాడు రామోజీరావు ఇక్కడే పుట్టారు. ఈ గడ్డమీద ఏదో మహత్యం ఉంది. ఒక వారసత్వానికి స్ఫూర్తిదాయకమైన ప్రాంతం ఇది’. అని చంద్రబాబు నాయుడు అన్నారు.

పేదవాడి కోసం పని చేస్తా

‘రాష్ట్ర పునర్నిర్మాణానికి చేయాల్సిందంతా చేస్తాం. తెలుగుప్రజలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎన్టీఆర్ పుట్టిన గడ్డమీద నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘నేను పేదవాడికోసమే పని చేస్తాను. అట్టడుగున ఉన్న పేదవారిని ఉన్నత స్థానాల్లో నిలిపేందుకు, ఆర్థికంగా గొప్పవాళ్లను చేసేందుకే నా శేష జీవితం మొత్తం అంకితం చేస్తాను. ఇదే మాట పదేళ్లముందు చెబితే రాజకీయాలు అన్నారు. నా ఆలోచనలు ఎప్పుడూ సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకొనే ఉంటాయి. అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది. రోడ్లు, నీళ్లు, పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. రైతులతోపాటు, పేదల సంపద పెరగాలి. అప్పుడే సమాజంలో ఆర్థిక అసమానతలు లేకుండా పోతాయి. దాన్ని ఈ గ్రామం నుంచే ప్రారంభిస్తాను. నిమ్మకూరు అభివృధ్ధికి ఒక కాన్సెప్ట్ తయారు చేస్తాను. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అవసరమైన పైలట్ ప్రాజెక్ట్‌ను నిమ్మకూరులోనే ప్రారంభిస్తాను. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికం గా అన్నివిధాల నిమ్మకూరును ముందుకు తీసుకెళ్లేలా మే 28నాటికి పనులు ప్రారంభిస్తాం. తెలుగుజాతి గర్వించేలా నిమ్మకూరు ప్రాంతాన్ని స్ఫూర్తిదాయకమైన ప్రాంతంగా తయారుచేస్తాం.’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Also Read...

సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ.. ఆ రాష్ట్రాల్లా చొరవ తీసుకోవాలని డిమాండ్

చంద్రబాబుకు షాకిచ్చిన Jr. NTR ఫ్యాన్స్‌ కార్టూన్ (13-04-2023)

Advertisement

Next Story

Most Viewed