కస్టడీలోకి తీసుకునేముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. రాజమండ్రికి సీఐడీ టీమ్

by Javid Pasha |
కస్టడీలోకి తీసుకునేముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు.. రాజమండ్రికి సీఐడీ టీమ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇవాళ సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో నేడు, రేపు ఆయనను సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నరు. కేసులో చంద్రబాబు పాత్రపై వివిధ ప్రశ్నలు అడగనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబును ప్రశ్నించవచ్చని కోర్టు పలు నిబంధనలు జారీ చేసింది.

చంద్రబాబు వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో కస్టడీలోకి తీసుకోవడానికి ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు జరిపించనున్నారు. అనంతరం చంద్రబాబును సీఐడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. విచారణ సమయంలో ప్రతి గంట తర్వాత 10 నిమిషాలపాటు బాబుకు బ్రేక్ ఇవ్వనున్నారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని, తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటామని ఏసీబీ కోర్టు తెలిపింది. చంద్రబాబును విచారించేందుకు 22 మంది అధికారులకు కోర్టు అనుమతి ఇచ్చింది. విచారణ చేపట్టే అధికారుల పేర్లను కూడా తమకు ముందే అందించాలని ఏసీబీ కోర్డు జడ్జి శుక్రవారం ఇచ్చిన తీర్పులో వెల్లడించారు.

అలాగే విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని, విచారణ వివరాలు మీడియాకు వెల్లడించవద్దని కోర్టు ఆదేశించింది. బాబును విచారించేందుకు ఇప్పటికే సీఐడీ అధికారులు రాజమండ్రికి చేరుకున్నారు. మరికాసేపట్లో సీఐడీ బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనుంది. పలు కీలక ఫైల్స్‌ను చంద్రబాబు ముందు ఉంచి ప్రశ్నించనున్నారు.

Next Story