ఆ రూ.1.10 లక్షల కోట్లు ఏమయ్యాయి? సంచలనం రేపుతున్న కాగ్ రిపోర్ట్

by Sathputhe Rajesh |
ఆ రూ.1.10 లక్షల కోట్లు ఏమయ్యాయి? సంచలనం రేపుతున్న కాగ్ రిపోర్ట్
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం అప్పుల్లోనూ, ఖర్చుల్లోనూ కొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. తాజా‌గా దీనిపై కాగ్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఏకంగా అసెంబ్లీకి తెలియకుండా రూ. లక్ష కోట్లకుపైగా జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది అన్న అంశం ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాల్లో సంచలనమే అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. గడచిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీకి తెలియకుండా రూ.1.10 లక్షల కోట్ల మేర ఖర్చు చేసినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. చట్ట సభల ఆమోదం లేకుండా ఇలా భారీ ఎత్తున ఖర్చు పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కాగ్ చెప్పింది. కనీసం ఇప్పటికైనా అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి ఆమోదం తీసుకోలేదని కాగ్ మొట్టికాయలు వేసింది. ఈ నివేదిక తాజాగా అసెంబ్లీ ముందుకు రావడం‌తో వివాదం చెలరేగింది.

ప్రభుత్వం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడింది ఇలా..

రాష్ట్ర ప్రభుత్వ బడ్డెట్ రిలీజ్ ఆర్డర్స్ లేకుండానే కన్సాలిడేటెడ్ ఫండ్ ద్వారా రూ. 8891 కోట్లు చెల్లించినట్లు కాగ్ నివేదిక తెలిపింది. వివిధ పథకాలు, స్థానిక సంస్థలకు రూ.26839 కోట్లు చెల్లించారని కాగ్ పేర్కొంది. ట్రెజరీ నిబంధనలు పాటించకుండా చెల్లింపులు చేయడానికి సరైన కారణాలు చెప్పలేదని జగన్ ప్రభుత్వం ఆక్షేపించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సీఎఫ్ఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపులు ట్రెజరీ నిబంధనలకు విరుద్ధమని కాగ్ చెప్పింది. వీటిపై తాము వేసిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తి కరంగా లేదని, ఇలా చేయడంతో ప్రభుత్వమే ఆర్థిక అక్రమాలకు, నిబంధనల ఆస్కారం ఇచ్చినట్లవుతోందని కాగ్ తెలిపింది.

ప్రభుత్వాన్ని వేధిస్తున్న మరో సమస్య

రాష్ట్ర ప్రభుత్వం 2020-21లో ఏకంగా 103 రోజుల పాటు ఒవర్ డ్రాఫ్ట్ తీసుకుందని కాగ్ తన రిపోర్టు‌లో పేర్కొంది. ఇలా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోకపోతే రోజు గడవని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని కాగ్ చెప్పింది. రాష్ట్ర ట్రెజరీ‌లో కనీస నిల్వ నిధులున్నది కేవలం 34 రోజులకు మాత్రమేనని వెల్లడించింది. ఆర్బీఐతో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో రోజుకు రూ.1.94 కోట్ల నిల్వ ఉంచాలని, అలా ఉంచకపోతే వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్, స్పెషల్ డ్రాయింగ్ సదుపాయాలతో వడ్డీతో కూడిన అప్పు తీసుకోవచ్చని తెలిపింది. ఈ పరిమితి దాటితే మాత్రం రాష్ట్ర క్రెడిట్ రేటింగ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆ స్థితికి అతి దగ్గరలో ఉందని కాగ్ చెప్పడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపైనా కాగ్ ఇచ్చిన రిపోర్ట్ చూసిన తర్వాత ప్రతిపక్షాలు ఒక్కసారిగా ప్రభుత్వంపై భగ్గుమన్నాయి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు లెక్కలు లేవని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని.. అయినప్పటికీ ప్రభుత్వం లెక్క చేయలేదని ఇప్పుడు కాగ్ నివేదిక‌తో ఆర్థిక పరిస్థితి బండారం మొత్తం బయటపడింది అని టీడీపీ అంటున్నది. ప్రభుత్వం తీసుకుంటున్న లెక్కల మించిన అప్పుల వివరాలు అసెంబ్లీకి చెప్పకపోవడం.. అదే సమయంలో భారీ ఎత్తున చేస్తున్న ఖర్చును సైతం అసెంబ్లీకి తెలియజేయకపోవడాన్ని ఆర్థికపరమైన నేరంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇంతకూ ఆ డబ్బు ఏమైనట్టు?

ప్రస్తుతం రాష్ట్రంలో అందరినీ వేధిస్తున్న ప్రశ్న అసెంబ్లీ‌కి సైతం వివరాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు దేని కోసం అని, దీనికి వైసీపీ నేతల వద్ద ఉన్న ఒకే ఒక్క సమాధానం సంక్షేమ పథకాలు. రాష్ట్రంలో హద్దు దాటి చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల భారాన్ని మోయడానికి ఈ డబ్బు ఖర్చు చేశారని వారు అంటున్నారు. కొంత మంది పెద్దలు జేబుల్లోకి పోయిందనీ, దీనిపై విచారణ జరగాలని ప్రతిపక్ష టీడీపీ అంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక విధానాల్లోని డొల్లతానాన్ని కాగ్ రిపోర్ట్ బయట పెట్టిందని నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed