అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు గొట్టడం చట్ట విరుద్ధం: సీపీఎం నేత వీ శ్రీనివాస్

by Seetharam |
అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు గొట్టడం చట్ట విరుద్ధం: సీపీఎం నేత వీ శ్రీనివాస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు అన్నారు. అంగన్వాడీల కోరికలు న్యాయమైనవని అని చెప్పుకొచ్చారు. రూ.13,500 వేతనం ఇస్తూ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో మంగళవారం ఉదయం సీపీఎం రాష్ట్రకార్యదర్శి వీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అక్కా చెల్లమ్మలకు అండగా ఉంటామని సీఎం జగన్‌ చెబుతారు… దానికి విరుద్ధంగా ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని ధ్వజమెత్తారు. బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు తక్షణం అంగన్వాడీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు గొట్టడం చట్ట విరుద్ధమన్నారు. ప్రభుత్వ అధికారులు బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తెరుస్తున్నారని అన్నారు. సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని అంగన్వాడీ కేంద్రాలు నడపడం సాధ్యం కాదని చెప్పారు. తక్షణం అంగన్వాడీ ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని… ప్రస్తుతం ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజలు స్వాధీనం చేసుకుంటే ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. మరి అంగన్వాడీ కేంద్రాలు ఎలా స్వాధీనం చేసుకుంటారు ? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌‌లో రాష్ట్ర ఎంపీలు గళమెత్తాలని పిలుపునిచ్చారు. దీనిపై అందరు ఎంపీ లకు లేఖలు రాశామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed