బ్రేకింగ్ : ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-15 05:20:49.0  )
బ్రేకింగ్ : ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
X

దిశ, ప్రతినిధి కడప : కడప జిల్లా కొండాపురం మండలం ఏటూరు గ్రామం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి కొండాపురం పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి.

అనంతపురం జిల్లా తాడిపత్రి, కర్నాటక రాష్ర్టం బళ్లారికి చెందిన 14 మంది బంధువులు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి తుఫాన్ వాహనంలో వెళ్లారు. దర్శనం అనంతరం అదే వాహనంలో వారి స్వగ్రామాలకు బయలు దేరారు. మార్గమద్యంలో కడప - తాడిపత్రి రోడ్డులోని కొండాపురం మండలం ఏటూరు గ్రామం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో వీరందరూ ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వస్తూ అదుపు తప్పి ఢీ కొంది. ఈ సంఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు 108 కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం

తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతం రోదనలతో మిన్నంటింది. కొండాపురం సీఐ సుదర్శన్, ఎస్ఐ సత్యనారాయణ హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రికి తరలించారు. ఈ మేరకు కొండాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story