'సీఎం ఇచ్చిన స్క్రిప్ట్‌నే మంత్రులు, ఎమ్మెల్యేలు చదువుతున్నారు'

by Vinod kumar |
సీఎం ఇచ్చిన స్క్రిప్ట్‌నే మంత్రులు, ఎమ్మెల్యేలు చదువుతున్నారు
X

దిశ, ఏపీ బ్యూరో: దేశంలో బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క బీజేపీ మాత్రమేనని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. స‌మాజంలోని అన్ని వర్గాలకు బీజేపీ న్యాయం చేస్తూ వారిని అభివృద్ధి పథం వైపునకు తీసుకెళ్తుందని చెప్పుకొచ్చారు. విజయవాడలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సోము వీర్రాజు డి నోటిఫైడ్ ట్రైబ్స్ కోసం ప్రధాని మోడీ రూ.10 వేలకోట్ల బడ్జెట్‌ను ప్రత్యేకంగా కేటాయించారని గుర్తు చేశారు. మోడీ సర్కార్ వల్లే బీసీలకు సముచిత గౌరవం దక్కుతోందని చెప్పుకొచ్చారు.

వైసీపీ, టీడీపీ పార్టీలు బీసీల‌కు త‌మ‌ల‌పాకులు ఇచ్చి, అగ్ర వ‌ర్ణాల వారికి తాంబూలాలు ఇచ్చార‌ని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం బీసీల‌కు, ఎస్సీల‌కు ప‌ద‌వులు ఇచ్చారు కానీ వారికి ప‌వ‌ర్ ఇవ్వలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మైండ్ గేమ్ పాలిటిక్స్ న‌డుస్తున్నాయ‌ని విమర్శించారు. రాష్ట్రంలో నిమ్న వ‌ర్గాల వ‌ర్గీక‌ర‌ణ చేయ‌మ‌న్న వైసీపీ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు.

ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం..

రాజధాని నిర్మించకుండా మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మండిపడ్డారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వని తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాట్లాడే దమ్ము వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. రాజధాని కోసం అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే రాజకీయం చేస్తారా అని నిలదీశారు. వైసీపీ నాయకులకు వ్యక్తిత్వం లేదన్నారు. సీఎం ఇచ్చిన స్క్రిప్ట్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలు చదువుతున్నారని చెప్పుకొచ్చారు.

కుటుంబ రాజకీయాలు, దందాలు, అవినీతి కోసం ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం బాధ్యతగా ఆలోచన చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. 60 ఏళ్లుగా చేయలేని అభివృద్ధి ని ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్లలో చేశారని చెప్పుకొచ్చారు. సోలార్ పవర్‌ను విదేశాలకు ఇచ్చే పరిస్థితికి త్వరలో చేరుకోబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పాల్ జీ, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి డా.పార్థసారథి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు, జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరాం, ఓబీసీ మోర్చా నేతలు పట్నాయక్, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story