GVL: అమిత్ షా చేతిలో ఏపీ రిపోర్టు.. సీఎం జగన్ క్షమాపణ చెప్పాల్సిందే

by srinivas |
GVL: అమిత్ షా చేతిలో ఏపీ రిపోర్టు.. సీఎం జగన్ క్షమాపణ చెప్పాల్సిందే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు ధ్వజమెత్తారు. ఏపీలో శాంతిభద్రతలు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్‌పై పూర్తి స్థాయి నివేదిక కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గర ఉందని తెలిపారు.

ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన విమర్శలు అందులో భాగమేనని జీవీఎల్ స్పష్టం చేశారు. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనలో వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు భూదందాలపై వేసిన సిట్ రిపోర్టు ఎందుకు బహిర్గతం చేయడం లేదని ధ్వజమెత్తారు. ఆ నివేదిక ఆధారంగానే సీఎం వైఎస్ జగన్ భూ సెటిల్మెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సిట్ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

మరోవైపు బాపట్ల జిల్లాలో పదో తరగతి బాలుడి పెట్రోల్ పోసి నిప్పటించి హత్య చేసిన ఘటనపైనా జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు దారుణమన్నారు. వైసీపీ కార్యకర్తలది రాక్షస మనస్తత్వమని మండిపడ్డారు. దారుణ హత్యకు గురైన విద్యార్థి అమర్‌నాథ్ కుటుంబానికి సీఎం జగన్, డీజీపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక, మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలని ఎంపీ జీవీఎల్ నర్సింహారావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed