బీసీల ద్రోహి జగన్.. మహాశక్తి పథకాన్ని అమలు చేస్తాం: నారా లోకేశ్

by Seetharam |
బీసీల ద్రోహి జగన్.. మహాశక్తి పథకాన్ని అమలు చేస్తాం: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ జగన్ పాలనలో బీసీ సంక్షేమాన్ని తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.బీసీల సంక్షేమానికి ఖర్చుచేయాల్సిన రూ.75,760 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన బీసీల ద్రోహి వైఎస్ జగన్ అని విమర్శించారు. జగన్ ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నించిన బీసీ సోదరులను దారుణంగా హతమార్చారు అని ఆరోపించారు. పాయకరావుపేట నియోజకవర్గం దేవవరంలో మంగళవారం యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా నారా లోకేశ్‌ను బీసీ సామాజికవర్గీయులు కలిసి వినతిపత్రం అందజేశారు.‘ఉత్తరాంధ్ర యాదవ సామాజికవర్గం ప్రజలు విద్య, ఆర్థిక, సామాజికంకగా చాలా వెనుకబడ్డాం. గొర్రెలు పెంపకం మా కుల వృత్తి. ఉత్తరాంధ్ర యాదవులను బిసీ-డి గ్రూపు నుండి బీసీ-బి గ్రూపులో చేర్చాలి. 50శాతం సబ్సిడీతో గొర్రెలు పెంపకందారులకు సబ్సిడీపై గొర్రెలు ఇప్పించాలి. 50ఏళ్లు నిండిన గొర్రెలు పెంపకందారులకు పెన్షన్ మంజూరు చేయాలి. గొర్రెలు పెంపకందారులకు రూ.10లక్షలు బీమా అందించాలి’ అని నారా లోకేశ్‌ని బీసీలు కోరారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ వారితో మాట్లాడారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసి బీసీల్లోని కులవృత్తుల వారి ప్రయోజనాలు దెబ్బతీసిన వ్యక్తి వైఎస్ జగన్ అని మండిపడ్డారు. గత టీడీపీ పాలనలో రూ.964కోట్లతో ఆదరణ పథకం ద్వారా 90శాతం సబ్సిడీపై పనిముట్లు అందించినట్లు గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గొర్రెల యూనిట్లను సబ్సిడీపై అందిస్తామని నారా లోకేశ్ వారందరికీ హామీ ఇచ్చారు.


మహిళల భద్రతకు పటిష్టమైన చట్టం తెస్తాం

వైసీపీ పాలనలో మహిళల భద్రత గాలిలో దీపంలా తయారైందని చెప్పుకొచ్చారు. లేని దిశాచట్టం పేరుతో మహిళలను జగన్ ప్రభుత్వం దారుణంగా మోసగిస్తోంది అని మండిపడ్డారు. పట్టపగలే మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గం గొడిచర్ల గ్రామంలో నియోజకవర్గ మహిళలు యువనేత లోకేశ్‌ను కలిశారు. ‘వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం చెప్పే దిశచట్టంతో ఎవరికీ న్యాయం జరగడం లేదు. మహిళలు ఇంటినుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళల రక్షణకు పటిష్టమైన చట్టం తీసుకురావాలి’ అని లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు మహిళల స్వయం ఉపాథికి శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేసి, సబ్సిడీ రుణాలు ఇప్పించాలని కోరారు. అర్హులైన వారందరికీ పెండ్లికానుక, ఒంటరి మహిళల పెన్షన్ అందించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈశాన్యరాష్ట్రాల తరహాలో మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మహిళల కష్టాలు తీర్చడానికి మహాశక్తి పథకాన్ని అమలుచేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిమహిళకు నెలకు ఆడబిడ్డ నిధికింద నెలకు రూ.2500 రూపాయల సాయంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు తెలిపారు.మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తామని... ఎటువంటి కొర్రీలు లేకుండా పెండ్లికానుక, ఒంటరి మహిళల పెన్షన్లు అందచేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.


దాహర్తిని తీరుస్తాం

టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉద్దండపురం రక్షిత మంచినీటి పథకాన్ని పూర్తిచేసి, మా 80గ్రామాలకు సురక్షితమైన నీటిని అందించే బాధ్యత తాను తీసుకుంటానని నారా లోకేశ్ ఉద్దండపురం గ్రామస్థులకు హామీ ఇచ్చారు. తమను ఎన్నుకున్న ప్రజలకు కనీసం తాగునీరు అందించిన దివాలాకోరు సీఎం జగన్ అని విమర్శించారు. ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం నిధులిస్తే, వాటిని ఉపయోగించుకోలేని అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉండటం దురదృష్టకరమని మండిపడ్డారు.టీడీపీ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన వెంటనే వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి ఇంటింటకీ కుళాయిల ద్వారా 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story