వంగి కొబ్బరికాయ కొట్టలేనోడివి నువ్వా యువకుడివి..? జగన్‌పై లోకేష్ ఫైర్

by Nagaya |
వంగి కొబ్బరికాయ కొట్టలేనోడివి నువ్వా యువకుడివి..? జగన్‌పై లోకేష్ ఫైర్
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి : వంగి కొబ్బరికాయ కొట్టలేనోడు.. చంద్రబాబును ముసలి వ్యక్తి అంటున్నాడు.. ఆయనతో తిరుపతి మెట్లెక్కే దమ్ముందా జగన్ అంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ చాలెంజ్ విసిరారు. శంఖారావంలో భాగంగా మాడుగుల నియోజకవర్గం, ఘాట్ రోడ్డు సమీపంలో సభ నిర్వహించారు. ఈ సభలో లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు, పవనన్నలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. వాటితో పాటు సూపర్ సిక్స్ పథకాలను సైతం తూచ తప్పకుండా అమలు చేసేందుకు ప్రణాళికలు చేసినట్టు చెప్పారు. తన సొంత తల్లి, చెల్లి నమ్మని జగన్మోహనరెడ్డిని రాష్ట్ర ప్రజలెలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. షర్మిల సొంత అన్నని గద్దె దించేందుకు సిద్ధమయ్యిందంటే జగన్మోహనరెడ్డి మానసిక స్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.

సైకిల్, గాజు గ్లాసులపై విమర్శలు చేస్తున్న జగన్మోహనరెడ్డి మీ ఫ్యాను రెక్కలు విరిగిపోయినట్టే.. పీకి చెత్త బుట్టలో వేసుకోవాల్సిందే.. రైతులు ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండు, కౌలు రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానానికి చేరిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మద్య నిషేధం చేయలేదు సరికదా.. బూం బూం అంటూ మద్యపాన దుకాణాలు ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కాస్తా అనాధ శ్రీగా మారిపోయిందన్నారు. అమ్మ ఒడి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 45 ఏళ్ళు దాటిన వారందరికీ పింఛన్ ఇస్తానని పేదలందర్నీ జగన్ మోసం చేశారన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్నారు.

బటన్ నొక్కి పది రూపాయలిచ్చి, వంద లాగేస్తున్నాడని విమర్శించారు. కోడి గుడ్డు మంత్రి ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. ఇదే కాదు.. అప్పటికే ఉన్న పరిశ్రమలను ఆంధ్రను వదిలిపోయేలా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా టీడీపీ, జనసేన చూసుకుంటుందన్నారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రంలో 25వేల కిలో మీటర్ల సీసీ రోడ్లు వేసామన్నారు. అవసరమైతే రాష్ట్ర బడ్జెట్ నుంచి గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి రూ.100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మాడుగుల నియోజకవర్గంలో శిధిలావస్థలో ఉన్న అన్ని రోడ్లు, వంతెనలకు మరమ్మతులు చేయిస్తామన్నారు.

నాపై ఈ ప్రభుత్వం అక్రమంగా 22 కేసులు పెట్టిందన్నారు. నిప్పు లాగా బతికిన వ్యక్తి చంద్రబాబు.. ఆయన్ను జైలుకు పంపి, ఇబ్బందులు పెట్టారు. జగన్ పెట్టే చిల్లర కేసులకు మేము భయపడమన్నారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన పలువురు నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. సభలో టీడీపీ నాయకులు గవిరెడ్డి రామనాయుడు, ఇన్చార్జీ పీవీజీ కుమార్, పైలా ప్రసాదరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story