ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఓట్ల తొలగించపుపై విచారణకు ‘సిట్’

by Bhoopathi Nagaiah |
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఓట్ల తొలగించపుపై విచారణకు ‘సిట్’
X

దిశ ప్రతినిధి, బాపట్ల: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేఖ ఓట్లను అక్రమంగా తొలగించారన్న ఫిర్యాదుతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం విచారణకు సిట్‌ను నియమించింది. ఈ మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్. దామోదర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ సీఎస్ కె విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్ తోపాటు మరో అధికారి సభ్యులుగా నియమించుకుని వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సిట్‌కు పోలీస్ స్టేషన్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం సీఐడీ డీజీపీ నియంత్రణలో పనిచేయనుంది. అలాగే సిట్ బృందానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించాలని బాపట్ల జిల్లా ఎస్పీని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సిట్ బృందం దర్యాప్తు పురోగతిని ఈసీకి దర్యాప్తులో భాగంగా సిట్ ఎవరినైనా విచారించి, అరెస్టు చేయవచ్చునని ఉత్తర్వుల్లో పేర్కొంది.

సిట్ ఏర్పాటు నేపథ్యం...

అప్పటి పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, మోసపూరిత సమాచారంతో ఓట్లను తొలగించేలా కుట్రలు చేశారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని పట్టుదలతో పోరాటం చేశారు. పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కోసం గంప గుత్తగా ఫాం-7 దరఖాస్తులు చేశారని, 24 వేల ఓట్లను ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని ఏలూరి సాంబశివరావు తన ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీలను స్వయంగా కలిసి పూర్తి ఆధారాలతో వివరించారు. ఎమ్మెల్యే ఏలూరి ఫిర్యాదు పై స్పందించిన ప్రభుత్వం పర్చూరులో 24 వేల ఫాం-7 దరఖాస్తులు పెట్టడంపై తాజాగా సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఓటర్ల తరఫున పోరాడిన ఏలూరి

పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమ మార్గంలో 24 వేలకు పైగా ఓట్లు తొలగించేందుకు వైసీపీ నేతలు,కార్యకర్తలు ఫాం-7 దరఖాస్తులు చేయించిన వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎమ్మెల్యే ఏలూరి ఓట్లు కోల్పోయిన ఓటర్లు తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. అర్హులైన ఓటర్లను అన్యాయంగా తొలగిస్తున్నారని సాక్షాధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఎమ్మెల్యే ఏలూరి న్యాయపోరాటానికి దిగారు. గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగం మొత్తం అధికార పక్షానికి కొమ్ముకాస్తుందని, సాక్షాలతో సహా ఏలూరి నిరూపించడంతో పలువురు అధికారులు సస్పెండ్ అయ్యారు. అప్పటి పర్చూరు వైసీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ కుట్రలను గమనించిన ఎమ్మెల్యే ఏలూరి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో పాటు ఓటర్లను చైతన్యం చేస్తూ చేసిన న్యాయపోరాటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడమే కాకుండా ఎమ్మెల్యే ఏలూరుకి తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక గుర్తింపు లభించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Next Story