అంగన్వాడీ ఆయా పోస్ట్‌లకు వేలం.. ఒక్క పోస్ట్‌కు మూడు లక్షలు..?

by sudharani |   ( Updated:2023-04-25 15:04:12.0  )
అంగన్వాడీ ఆయా పోస్ట్‌లకు వేలం.. ఒక్క పోస్ట్‌కు మూడు లక్షలు..?
X

దిశ, అమలాపురం: నిరుపేద కుటుంబానికి ఆసరాగా ఉండే చిన్న ఆయా పోస్ట్‌కు సైతం నేడు వేలంపాటలో లక్షలకు లక్షలు పలుకుతున్న వైనం. అక్కడ అంతా కుల కట్టు బాటు, కుల పెద్దరికమే. పెద్దలను కాదని ఆ గ్రామంలో ఏమి చేయటానికి వీల్లేదు. ఏ చిన్న పనైనా.. పోస్టైనా ఆ గ్రామంలో పార్టీలకతీతంగా కుల పెద్దలు సమావేశమై నిర్ణయిస్తారు. ఇదంతా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బెండ మూర్లంక గ్రామ పరిధిలోని ఆరగట్లపాలెం మత్స్యకార గ్రామంలో జరుగుతున్న ఘటన. ఎవరైనా నిరుపేద కుటుంబానికి చెందిన లేదా ఏ ఆసరాలేని అభాగ్యురాలికి జీవనోపాధి కై గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పనిచేసేందుకు ఆయా పోస్ట్ ఇస్తూ ఉంటారు.

అయితే ఈ గ్రామంలో ఆ పోస్ట్ అక్షరాల మూడు లక్షల పలికింది. ఇలా ఎందుకంటే ఆ పోస్టుకు గ్రామంలోని ఐదారుగురు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కుల పెద్దలు కలగజేసుకుని ఎవరికి సిఫారసు చేసిన ఇబ్బందులు ఎదురవుతాయని ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికే ఆ పోస్ట్ అంటూ వేలంపాట నిర్వహించారు. దీంతో ఓ మహిళ అక్షరాల మూడు లక్షలకు ఆయా పోస్ట్ పాడుకుని దక్కించుకుంది. అయితే ఇదంతా 15 రోజుల క్రితమే గుట్టు చప్పుడు కాకుండా గ్రామంలోని ఒక ఆలయ ఆవరణలో వేలంపాట నిర్వహించారు. ఇదిలా ఉంటే ఈ విషయమై ఎవరిని నిర్ణయించేది మేమంతా కలిసి నిర్ణయం తీసుకుంటామని స్థానిక మంత్రి విశ్వరూప్ దృష్టికి పెద్దలు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రి వద్దకు వెళ్లిన తర్వాతే వేలంపాట నిర్వహించినట్లు సమాచారం. అయితే ఆ మహిళ ప్రస్తుతం వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఆయా పోస్ట్ జాయిన్ అయిన వెంటనే వాలంటీర్ ఉద్యోగానికి రిజైన్ చేసి ఆయా పోస్టులో చేరేందుకు ఆ మహిళ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మూడు లక్షలకు ఆయా పోస్ట్ దక్కించుకున్న దాని వెనకాల ఉన్న మర్మం ఏమిటంటే త్వరలో అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న టీచర్ సర్వీస్ ముగియనుందని అర్హతను బట్టి ఆయాకే టీచర్ ఉద్యోగం వస్తుందని ఆలోచనతోనే ఆ మహిళ వేలంపాటలో మూడు లక్షలకు ఆయా పోస్ట్ దక్కించుకున్నట్లు సమాచారం. వేలంపాట ద్వారా వచ్చే సొమ్మును గ్రామంలో అమ్మవారి జాతర్లకు ఇతర కార్యక్రమాలకు కులకట్టుబాట్లు ప్రకారం ఖర్చు చేస్తారు. అంతేకాకుండా గ్రామంలో మంజూరయ్యే హౌసింగ్ లోన్ విషయంలోనూ కుల పెద్దల నిర్ణయమే అంతిమంగా నిర్ణయిస్తారు. హౌసింగ్ లోన్ విషయంలోను తమకు అన్యాయం జరుగుతుందంటూ పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇంటింటికి కులాయివేసిన విషయంలోనూ కొందరు పలుకుబడి ఉన్న నాయకులు రెండు మూడు కొలాయిలు వేసుకున్నారని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కులకట్టుబాట్లు కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

నీటిపారుదలశాఖ సూపరిండెంటెంట్ కార్యాలయం ఏర్పాటుకు జీవో విడుదల

Advertisement

Next Story

Most Viewed