ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యం: మంత్రి సత్యకుమార్

by karthikeya |
ప్రభుత్వంపై విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యం: మంత్రి సత్యకుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నా విపక్షనేతలు విమర్శలు చేయడం సమంజసం కాదని, రాజకీయాలను పక్కన పెట్టి బాధితులను ఆదుకోవడానికి సమష్టిగా కలిసిరావాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ (Health Minister Satyakumar) పిలుపునిచ్చారు. వరద బాధితులకు అందిస్తున్న సహాయసహకారాలపై మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం ముంపు ప్రాతాలన్నింటిలో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని, సోమవారం నుంచి 3 రోజుల పాటు ఆరోగ్య శాఖ డ్రైవ్ (Health Department Special Drive) నిర్వహించనుందని చెప్పారు. వరద బాధితులందరికీ వైద్య సేవలు అందిస్తున్నామని, ఇంటింటికీ వెళ్లి వ్యాధులను గుర్తించి చికిత్స చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో 124 వెుడికల్ క్యాంపు (Medical Camps)లు ఉన్నాయని, బాధితులకు లక్షకు పైగా ఆరోగ్య కిట్లు పంపిణీ చేశామన్నారు.

అలాగే వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దీనివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎలాంటి అనారోగ్యాలతో బాధపడుతున్నారు అనేది తెలుసుకునేందుకు వీలుంటుందని అన్నారు.

‘ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఇంత త్వరితగతిన ఎక్కడా సహాయకార్యక్రమాలు జరగడం గొప్ప విషయం. ఇంత పెద్ద విపత్తును ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి నుంచి అధికార యంత్రాంగం మొత్తం సమష్టిగా పనిచేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్వయంగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అనేకమంది మంత్రులను, ఐఏఎస్ ఆఫీసర్లను వార్డుల్లో ఇంచార్జులుగా పెట్టారు’ అని తెలిపారు.

ప్రభుత్వం ఇంత అద్భుతంగా పనిచేస్తున్నా విపక్షనేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, విమర్శలు చేస్తున్నాయని, ఇది వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మంత్రి అన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story