Mlc Elections: జోరుగా ప్రలోభాల పర్వం..ఓటర్లకు డబ్బు పంపిణీపై మంత్రి ఉషాశ్రీ వీడియో వైరల్

by srinivas |   ( Updated:2023-03-12 12:33:16.0  )
Mlc Elections: జోరుగా ప్రలోభాల పర్వం..ఓటర్లకు డబ్బు పంపిణీపై మంత్రి ఉషాశ్రీ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా ప్రలోభాలు జరుగుతున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు తమకే ఓటు వేయాలని హామీలు కూడా తీసుకుంటున్నారు. అధికార పార్టీ అయితే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఓట్లు కొనేందుకు డబ్బులు పెద్ద ఎత్తున వెదజల్లుతోంది. ఓటర్ల డిమాండ్‌ను బట్టి డబ్బులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ, అనంతపురంలో ఈ ప్రలోభాల పర్వానికి హద్దు అదుపు లేకుండా పోతోంది. ఓటర్లకు యదేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.

తాజాగా అనంతపురలో ఓటర్లకు డబ్బుల పంపిణీపై వైసీపీ నేతలతో మంత్రి మంత్రి ఉషశ్రీ మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు పంపిణీపై ఆమె ఆరా తీశారు. ఓటర్లకు డబ్బుల పంపిణీపై నాయకులతో చర్చించారు. బూత్‌ల వారీగా ఎవరెవరికి డబ్బులు పంచారని అడిగి తెలుసుకున్నారు. డబ్బులు తీసుకున్న వారి సంతకాలు తెచ్చారా అంటూ పార్టీ నాయకులతో చర్చించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బుల పంపిణీ వ్యవహారంలో స్వయంగా మంత్రి ఉషశ్రీనే ఉండటంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నేతల ప్రలోభాలపై అటు ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.


మరోవైపు విశాఖ 16వ వార్డు బూత్ నెం.232‌లో వైసీపీకి చెందిన వ్యక్తి డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న సుధాకర్‌ను గెలిచిపించాలని ఎంపీ అనుచరుడు ఈశ్వర్ రావు‌ డబ్బులు పంచుతున్నారు. లక్షల రూపాయలు జేబులో పెట్టుకుని ఓటర్లకు పంచేందుకు ప్రయత్నించారు. దీంతో ఈశ్వర్‌రావు‌ను స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులతో పాటు టీడీపీ నేతలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఈశ్వర్‌రావు ఎంపీ నిర్మాణ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు గుర్తించారు.

Advertisement

Next Story