- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- క్రైమ్
- ఎడిట్ పేజీ
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో అరుదైన బౌద్ధ స్తూపం.. ఆదరణకు నోచుకునేదెప్పుడు?

దిశ, వెబ్ డెస్క్: భారతదేశానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అందుకు సాక్ష్యంగా ఎన్నో అద్భుత కట్టడాలు, కళాఖండాలు నేటికి చెక్కుచెదరకుండా మనకు దర్శనమిస్తున్నాయి. కానీ, ఆ అద్భుత కట్టడాలు కొన్నింటికి సరైన రక్షణ లేకపోవటంతో కనుమరుగైపోతున్నాయి. అలా శిథిలావస్థకు చేరుకుని పర్యాటకుల ఆదరణకు నోచుకుండా ఉంది ఏపీలోని ప్రశాకం జిల్లా చందవరంలోని మట్టి బౌద్ధ క్షేత్రం.
ప్రకాశం జిల్లాలోని చందవరం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ నది పక్కనే క్రీ.శ.2వ శతాబ్ధానికి చెందిన బౌద్ధ క్షేత్రం ఉంది. ఇది శాతవాహనుల పాలనా కాలం నాటి మట్టి నిర్మాణంగా చారిత్రాక ఆధారాలున్నాయి. 1965లో చందవరం గ్రామస్థులు ఊరికి సమీపంలోని సింగరకొండపై ఇళ్ల నిర్మాణం కోసం మట్టి తవ్వకాలు చేస్తుండగా ఈ బౌద్ధ స్థూపం బయటపడింది. 300 అడుగుల ఎత్తు కొండపైన ఈ స్తూపం ఉంటుంది. ఈ నిర్మాణం మొత్తం మట్టితోనూ, పెద్దపెద్ద ఇటుకలతోనే ఉంటుంది. 1972లో పురావస్తు శాఖ 92 ఎకరాల విస్తీర్ణంలోని ఈ బౌద్ధ క్షేత్రాన్ని స్వాధీనం చేసుకుంది. ఉత్తర భారతదేశంలోని సాంచీస్తూపం తర్వాత దక్షిణ భారత దేశంలో అంతటి విశిష్టత ఈ స్తూపానికి ఉందని పురావస్తు శాఖ తెలిపింది. అలాగే బౌద్ధమతంలోని ప్రబలమైన హీనయానానికి ఈ క్షేత్రం సూచిక అని పేర్కొంది.
భారతదేశంలో మట్టితో కట్టిన డబుల్ స్ట్రక్చర్ ఏకైక బౌద్ధం స్తూపం ఇదే కావటం విశేషం. ఇక బౌద్ధ స్తూపానికి ఉత్తర భాగంలో 19 ధ్యాన గదులు, 16 పిల్లర్లు ఉన్నాయి. ఈ స్తూపం 120 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు చుట్టూ శిలాఫలకాలు ఉన్నాయి. ఆ ఫలకాల్లో బోధివృక్షం, సింహాసనం వంటి ఛాయలున్నాయి. ఉత్తర భాగంలో బుద్ధుని ధ్యానిస్తున్న శిలాఫలకం ఉంది. అందుకే దీన్ని హీనాయాన శాస్త్ర నిర్మాణంగా పిలుస్తున్నారు. బౌద్ధ భిక్షువులు వారణాసి నుంచి కంచికి ప్రయాణించే సమయంలో ఈ క్షేత్రాన్ని ఆరాధనా కేంద్రంగా , విశ్రాంతి స్థలంగా ఉపయోగించే వారని చారిత్రకారులు చెబుతున్నారు. స్తూపం చుట్టూ.. బౌద్ధ భిక్షువుల కోసం పాలరాతితో నిర్మించిన విశ్రాంతి గదులు, ధ్యాన మందిరాలు, కొండపై వారు వినియోగించిన రోలు లాంటివి కూడా ఉన్నాయి.
ఈ బౌద్ధ స్తూపం విశిష్టత తెలియజేస్తూ ప్రభుత్వం ఇక్కడ మ్యూజియం కూడా ఏర్పాటు చేసింది. అయితే, 2001, 2002 సంవత్సరాల్లో ఇక్కడ వరుసగా దొంగతనాలు జరిగి విలువైన బౌద్ధ కళాఖండాలు చోరీకి గురయ్యాయి. దీంతో మ్యూజియంలోని మిగతా వాటిని చందవరం గ్రామంలో భద్రపరిచారు. 2011లో అంటే దాదాపు 14 ఏళ్ల క్రితం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన క్యాంటీన్ ఇప్పటి వరకు ప్రారంభానికి కూడా నోచుకోలేదు. ఎంతో చరిత్ర ఉన్న ఈ బౌద్ధ స్తూపం ప్రస్తుతం నిరాధరణకు గురవుతోంది. పట్టించుకునే వారే లేక కనుమరుగవుతోంది. ప్రభుత్వం ఇకనైన స్పందించి దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని పర్యాటకులు కోరుతున్నారు.