ఆ నాలుగు జిల్లాల్లో కట్టడి చేస్తే చాలు..!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు వెయ్యికి చేరువవుతున్నాయి. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి సమీక్షల్లో పలు సూచనలు చేస్తున్నారు. అధికారులు కూడా తీసుకుంటున్న జాగ్రత్తలపై వివరాలు ఇస్తున్నాయి. లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతోంది. నిన్న మొన్నటి వరకు ఢిల్లీలో జరిగిన తబ్లిఘీ జమాత్ మర్కజ్‌ను విమర్శించే వెసులుబాటు ఉండేది. ఇప్పుడది కూడా లేదు. రాష్ట్రంలో కేసులు మాత్రం కొలిక్కి రావడం లేదు. లోపం ఎక్కడుంది?.. ఏం చేస్తే కరోనా ప్రభావం తగ్గుతుందని రాజకీయ, అధికార యంత్రాంగం జట్టుపీక్కుంటోంది. ఏపీలో కరోనా వైరస్ […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు వెయ్యికి చేరువవుతున్నాయి. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి సమీక్షల్లో పలు సూచనలు చేస్తున్నారు. అధికారులు కూడా తీసుకుంటున్న జాగ్రత్తలపై వివరాలు ఇస్తున్నాయి. లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతోంది. నిన్న మొన్నటి వరకు ఢిల్లీలో జరిగిన తబ్లిఘీ జమాత్ మర్కజ్‌ను విమర్శించే వెసులుబాటు ఉండేది. ఇప్పుడది కూడా లేదు. రాష్ట్రంలో కేసులు మాత్రం కొలిక్కి రావడం లేదు. లోపం ఎక్కడుంది?.. ఏం చేస్తే కరోనా ప్రభావం తగ్గుతుందని రాజకీయ, అధికార యంత్రాంగం జట్టుపీక్కుంటోంది.
ఏపీలో కరోనా వైరస్ నాలుగు జిల్లాల్లోనే విస్తరించి ఉంది. ఆ జిల్లాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లోనే బయటపడుతోంది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనే 66.06 శాతం కేసులు అంటే 955 కేసుల్లో 642 కేసులు ఈ జిల్లాల్లోనే నమోదయ్యాయంటే ఇక్కడ కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 54340 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసింది. ఈ లెక్కన ఇన్ఫెక్షన్ రేటు 1.85 శాతం మాత్రమే. డిశ్చార్జి అయ్యే పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు అధికారు చెబుతున్నాయి.
ఇక జిల్లాల వారీగా తీసుకుంటే కర్నూలు జిల్లాలో 26.20 శాతం కేసులు నమోదైతే, గుంటూరు జిల్లాలో 21.83 శాతం కేసులు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 48.03 శాతం. మిగిలిన రెండు జిల్లాలు కలిపి 18.03 శాతం కేసులున్నాయి. దీంతో ఈ నాలుగు జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. అలాగే కరోనా వ్యాప్తి చెందిన 181 క్లస్టర్లను అధికారులు గుర్తించారు. అవన్నీ పక్కన పెడితే రాష్ట్రంలోని 676 మండలాలున్నాయి. అందులో 56 మండలాలు రెడ్ జోన్‌లో ఉంటే 47 మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన 573 మండలాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయి. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ డైరెక్టర్ జవహర్ రెడ్డి చెబుతున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా మాత్రం కొలిక్కి రావడం లేదు. రోజూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏపీలోని 181 క్లస్టర్లలో 121 క్లస్టర్లు పట్టణ ప్రాంతాల్లో ఉంటే, 60 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాల్లో కరోనా కేసులు నియంత్రించేందుకు ‘గ్రీన్ జోన్‌లను కాపాడండి.. రెడ్‌జోన్‌లను నియంత్రించండి’ అనే కొత్త నినాదాన్ని తీసుకొచ్చామని ఆయన చెప్పారు.
త్వరలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 3 మాస్స్‌లు ఇస్తామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 16 వేల పడకలకు 2.21 లక్షల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సరఫరా జరిగేలా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల్లో వెంటిలేటర్ కంటే ఆక్సిజన్ చికిత్సే మంచిదని చెబుతోందన్నారు. కొరియా నుంచి దిగుమతి చేసిన కిట్లతో పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఐసీఎంఆర్ ఆదేశాలిచ్చిందని ఆయన తెలిపారు. గత ఫిబ్రవరి 25 నాటికి రాష్ట్రంలో ఒకే ఒక్క ల్యాబొరేటరీలో 90 టెస్టుల సామర్థ్యం ఉంటే.. ఇప్పుడు ల్యాబ్‌ల సంఖ్య 9కి పెంచి రోజుకు 6,000కుపైగా టెస్టులు చేస్తున్నామని ఆయన చెప్పారు.
కరోనా పరీక్షలు ఎక్కడ చేసినా వైరాలజీ ల్యాబొరేటరీలో చేసేదే ఫైనల్ పరీక్ష అని ఆయన చెప్పారు. ఎక్కువ మందికి స్క్రీనింగ్ చేయడానికి ర్యాపిడ్ టెస్టులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఔట్ పేషెంట్ విభాగం రోగులకు 14410 నంబర్ ద్వారా టెలి మెడిసిన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కరోనా నియంత్రణకు 306 మంది డాక్టర్లు స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చారని ఆయన వెల్లడించారు. మరోవైపు కరోనా సిబ్బందికి 3 లక్షల పీపీఈ కిట్లు, 1.40 లక్షల ఎన్–95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు.
tags: corona virus, covid-19, ap health department, jawahar reddy, medical support,