మృతులు 12 మంది.. కోటి చొప్పున అందించండి: జగన్
దిశ ఏపీ బ్యూరో: వైజాగ్‌లోని వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎస్ నీలం సాహ్ని, కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్ ఆర్ కే మీనా ఆయనకు వివరించారు. ఎల్జీ పాలిమర్స్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అన్నారు. పూణెకు చెందిన ఎన్విరాన్‌మెంట్ […]
దిశ ఏపీ బ్యూరో: వైజాగ్‌లోని వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎస్ నీలం సాహ్ని, కలెక్టర్ వినయ్‌చంద్, పోలీస్ కమిషనర్ ఆర్ కే మీనా ఆయనకు వివరించారు.
ఎల్జీ పాలిమర్స్‌లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అన్నారు. పూణెకు చెందిన ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన 9 మంది శాస్త్రవేత్తలు గ్యాస్ లీక్ అయిన ఎల్‌జీ పాలిమర్స్‌లో న్యూట్రలైజర్‌ను ఉపయోగించి విషవాయువు బయటకు రాకుండా గడ్డకట్టించే ప్రయత్నం చేశారని అన్నారు. మరోవైపు స్టెరీన్ తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన రసాయనం పారా టెర్షియరీ బ్యుటైల్ కాటెకాల్ (పీటీబీసీ) రసాయనం గుజరాత్‌లోని వాపి పట్టణంలో మాత్రమే దొరుకుతుంది. ఘటన జరిగిన వెంటనే సీఎం కార్యాలయం రసాయనాన్ని పంపించాలని గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కోరగా, వెంటనే వారు దానిని పంపించారు.
దీంతో శాస్త్రవేత్తలతో పాటు అనుభవమున్న గుజరాత్ నిపుణులు పీటీబీసీని ఉపయోగించి రసాయనాన్ని న్యూట్రలైజ్ చేశారు. ట్యాంకర్‌లోని రసాయనంలో 60శాతం పాలిమరైజ్ అయ్యిందని, మిగిలిన 40శాతం కూడా పాలిమరైజ్ అవుతుందని తెలిపారు. దీనికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని వారు వెల్లడించారు. ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులు కూడా భద్రంగా ఉన్నాయని చెప్పారు. మరోవైపు స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీ వస్తోందని వివరించారు.
అనంతరం సీఎం ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేసి తగిన కార్యాచరణ, ప్రణాళికతో రావాలని అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి క్రియాశీలకంగా ఉండాలని సూచించారు. వైజాగ్‌లో విషవాయువులు వెదజల్లే కంపెనీలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని, జనావాసాల్లోని పరిశ్రమలను గుర్తించాలని తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, నష్టనివారణకు సరైన ప్రణాళిక ఉండాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల్లో విషపదార్థాల నిల్వలపై పరిమితులు విధించాలని చెప్పారు. దర్ఘటనలో 12 మంది మరణించారన్న ఆయన, మృతుల కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
tags: ysrcp, ys jagan, lg polymers tragedy, vizag, gas leak, ap cm, cm jagan