దద్దరిల్లిన ఢిల్లీ తెలంగాణ భవన్.. యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిందే కొలువుల కోసమైతే ఇప్పుడు ఉత్తరాదివారికి పెద్ద పీట వేస్తూ స్వరాష్ట్ర యువతకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు పదుల సంఖ్యలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ నుంచి వచ్చే ప్రజల సౌకర్యం కోసం ఢిల్లీలో భవన్ కట్టుకున్నా ఇక్కడికి వచ్చి తిరిగి హిందీలో మాట్లాడాల్సి వస్తున్నదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికే ఆపద వచ్చి పడిందని ఢిల్లీ యూనివర్శిటీ, జవహర్‌లాల్ నెహ్రూ […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిందే కొలువుల కోసమైతే ఇప్పుడు ఉత్తరాదివారికి పెద్ద పీట వేస్తూ స్వరాష్ట్ర యువతకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు పదుల సంఖ్యలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ నుంచి వచ్చే ప్రజల సౌకర్యం కోసం ఢిల్లీలో భవన్ కట్టుకున్నా ఇక్కడికి వచ్చి తిరిగి హిందీలో మాట్లాడాల్సి వస్తున్నదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికే ఆపద వచ్చి పడిందని ఢిల్లీ యూనివర్శిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు శుక్రవారం ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు.
అప్పుడు తెలంగాణ కోసం ఆత్మహత్యలు, ఇప్పుడు జాబుల కోసం ఆత్మహత్యలా అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మా జాబులు మాక్కావాలె అని నినదించారు. మా భవన్‌లో మాకే ఉద్యోగాలు ఇవ్వాలె అని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌ను హిందీ భవన్‌గా, నార్త్ భవన్‌గా మార్చవద్దని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న 74 మందిలో కేవలం నలుగురు మాత్రమే తెలంగాణకు చెందినవారు ఉన్నారని, మరో నలుగురు ఆంద్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారని, ఒక్కరు కర్నాటకకు చెందినవారని, మిగిలిన 65 మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారేనని వివరాలతో సహా భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌కు లిఖితపూర్వకంగా ఒక మెమొరాండాన్ని సమర్పించారు.
గత నెల చివరి వారంలో కూడా ఇదే డిమాండ్‌తో విజ్ఞపనపత్రాన్ని సమర్పించామని, కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందువల్లనే ఇప్పుడు నిరసన ప్రదర్శన చేపట్టాల్సి వచ్చిందని ఢిల్లీలోని పలు విశ్వవిద్యాలయాలు కలిపి ఏర్పాటు చేసుకున్న తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వివేక్ రెడ్డి మీడియాకు వివరించారు. కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు ఉద్యోగాల కోసం కూడా ఉద్యమాన్ని చేయాల్సి వస్తున్నదన్నారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణకు చెందిన ఉద్యోగుల స్థానంలో పరాయి రాష్ట్రాలకు చెందినవారు పనిచేస్తుండడం రాష్ట్ర అస్తిత్వ నినాదానికి, ఆత్మగౌరవానికే మచ్చగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్‌లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తన పరిధిలో లేదని, ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉంటుందని విద్యార్థులకు వివరించిన రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణకు చెందినవారినే నియమించాలన్న అంశాన్ని ప్రభుత్వానికి వివరిస్తామని విద్యార్థులకు నచ్చచెప్పారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, ప్రస్తుత రెసిడెంట్ కమిషనర్ హయాంలోనే ఈ పరిస్థితి నెలకొన్నదని విద్యార్థుల లేవనెత్తిన అంశంపై ఆశించిన స్పందన రాలేదని విద్యార్థి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ కార్యదర్శి మహిత్, వైస్ ప్రెసిడెంట్ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.