యువత ప్రాణం తీస్తోన్న IPL
దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ మహా నగరంలో ఐపీఎల్ బెట్టింగ్ దందా జోరుగా కొనసాగుతోంది. వయస్సు, వృత్తులతో సంబంధం లేకుండా చాలా మంది ఈ బెట్టింగులకు ఆకర్షితులవుతున్నారు. నిర్వాహకులు వీటిని ఆన్‌లైన్‌లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. చట్ట విరుద్ధమని తెలిసినా, సులభంగా డబ్బును సంపాదించవచ్చనే ఆశతో యువత సహా అన్ని వర్గాలవారు పందేల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఇది వ్యాపార, సంపన్నవర్గాలకే పరిమితం. జల్సాలకు అలవాటు పడుతున్న మధ్య తరగతి, సాధారణ యువత […]
దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ మహా నగరంలో ఐపీఎల్ బెట్టింగ్ దందా జోరుగా కొనసాగుతోంది. వయస్సు, వృత్తులతో సంబంధం లేకుండా చాలా మంది ఈ బెట్టింగులకు ఆకర్షితులవుతున్నారు. నిర్వాహకులు వీటిని ఆన్‌లైన్‌లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. చట్ట విరుద్ధమని తెలిసినా, సులభంగా డబ్బును సంపాదించవచ్చనే ఆశతో యువత సహా అన్ని వర్గాలవారు పందేల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఇది వ్యాపార, సంపన్నవర్గాలకే పరిమితం. జల్సాలకు అలవాటు పడుతున్న మధ్య తరగతి, సాధారణ యువత కూడా క్రమేపీ ఈ బెట్టింగ్ దందాకు బానిసలై పోతున్నారు. తీవ్రంగా నష్టపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.
అత్యంత గోప్యంగా…
ఈ దందాను అత్యంత గోప్యంగా నిర్వహిస్తారు. బెట్టింగ్ రాయుళ్లతోపాటు నిర్వాహకులు కూడా ఇది బయటపడకుండా చూసుకుంటారు. పోలీసులకు ఫిర్యాదులు కూడా తక్కువే. వివిధ మార్గాల ద్వారా తాము సమాచారం తెలుసుకుని మాత్రమే పోలీసులు దాడులు నిర్వహించి, అనేక మందిని అరెస్టు చేశారు. నిఘా నేత్రాలకు చిక్కకుండా ఉండే ఈ బెట్టింగ్ దందాకు అంతే లేదు. ఇందుకు సంబంధించిన మొబైల్ యాపులు ఆన్లైన్‌లో పదులు సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి పదులు, వందల మంది బెట్టింగులకు దిగుతూ లక్షల, కోట్ల లావాదేవీలు కొనసాగిస్తున్నారు. గెలుపు, ఓటమితోపాటు, బంతిబంతికీ పందెం కాస్తారు. హైదరాబాద్ లో నిర్వహించే బెట్టింగ్ దందాల మూలాలన్నీ అత్యధికంగా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్, గోవా తదితర నగరాలలోనే ఉంటున్నాయి. రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అక్కడి బెట్టింగ్ నిర్వహణపై మూలాలు వెతుక్కుంటూ నగరానికి వచ్చే వరకూ మన పోలీసులకు ఈ విషయం గురించి తెలియకపోవడం గమనార్హం. బుకీల మీద మరింత నిఘా పెడితే బెట్టింగులను కొంతమేరకు అరికట్టే అవకాశం లేకపోలేదు.
ఆర్థికంగా చితికిపోయి…
ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులు సామాన్యులను ఛిన్నాభిన్నం చేశాయి. రోజువారీ జీవితంలో నిత్యం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా ప్రతి ఒక్కరూ ఈజీ మనీ వైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల యావత్తు ప్రపంచాన్ని కాటేసిన కరోనా మనుషుల ఆర్థిక అవసరాల ప్రాధాన్యాన్ని గుర్తు చేసింది. క్రికెట్‌కు అన్ని వర్గాల్లోనూ ఎనలేని మక్కువ ఉన్నందున, అదృష్టం కలిసొస్తే జాక్‌పాట్ కొట్టవచ్చనే ఆశతో వ్యాపారవర్గాలతో పాటు ఉద్యోగులు, యువత కూడా బెట్టింగులకు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో వేల నుంచి లక్షల వరకూ పందాలు కాస్తూ నష్టపోతున్నారు. ఈ దందాలో వచ్చేది తక్కువ, పోగొట్టుకునేది ఎక్కువ అనే విషయాలను గ్రహించలేని అమాయకులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఫలితంగా అప్పటికే తమ చేతిలోని సొమ్మంతా పోగొట్టుకోవడంతో ఇంట్లో సమాధానం చెప్పుకోలేక మానసిక సంఘర్షణకు లోనై ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నగరంలో ఎస్సార్ నగర్, పంజాగుట్ట ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.