నోరు జారి నాలిక్కరుచుకున్న రోజా.. నెటిజన్ల నవ్వులు

నాలుక మడతేయడంలో రాజకీయ నాయకులను మించినవారు లేరని సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ రోజా నిరూపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ అద్భుతమైన వీడియో పెట్టి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రోజా.. తరువాత నాలిక్కరుచుకుని మరో వీడియో విడుదల చేసి సోషల్ మీడియాలో నవ్వుల పాలయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే… కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో విచక్షణాధికారాలను వినియోగించి స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలపాటు […]

Update: 2020-03-16 06:39 GMT

నాలుక మడతేయడంలో రాజకీయ నాయకులను మించినవారు లేరని సినీ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ రోజా నిరూపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసీ నిర్ణయాన్ని సమర్ధిస్తూ అద్భుతమైన వీడియో పెట్టి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రోజా.. తరువాత నాలిక్కరుచుకుని మరో వీడియో విడుదల చేసి సోషల్ మీడియాలో నవ్వుల పాలయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే…

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో విచక్షణాధికారాలను వినియోగించి స్థానిక సంస్థల ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలపాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయం వెలువడగానే రోజా అత్యుత్సాహంతో ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో.. రోజా మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలు వాయిదా చేయడం చూశాము..దానిని చంద్రబాబు రాజకీయం చేస్తూ.. వైఎస్సార్సీపీ భయపడిపోయి ఈసీతో ఎలక్షన్స్ వాయిదా వేయించిందని మాట్లాడడం సిగ్గు చేటు..అచ్చెన్నాయుడు టీవీలో మాట్లాడడం చూశాను.. ఆయనకు ఒళ్లు పెరిగిందే కానీ బుధ్ది పెరగలేదని అనేక సందర్భాల్లో చెప్పిన సంగతి నిజమని తెలుస్తోంది. పక్క రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఈ రోజు కరోనా వైరస్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు. ఎంత భయబ్రాంతులకు గురి చేస్తోందో తెలుసుకుని పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకున్నారు. స్కూళ్లు సెలవులిచ్చారు. షాపింగ్ మాల్ మూసేశారు. ఎలక్షన్స్ నిర్వహిస్తే జనాలు గుమిగూడాలనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని అంటూ ఈసీ నిర్ణయాన్ని సమర్థించారు.

ఇంతలో పార్టీ అధిష్ఠానం ఈసీ నిర్ణయంపై మండిపడింది. సాక్షాత్తూ సీఎం కులం కారణంగానే ఈ నిర్ణయమంటూ విమర్శించారు. దీంతో నాలిక్కరుచుకున్న రోజా… మరో వీడియో అప్‌లోడ్ చేశారు. అందులో.. చంద్రబాబునాయుడు ఓటమి భయంతో ఎన్నికల్ని వాయిదా వేయడానికి తన మనిషైన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో ఏవిధంగా నాటకాలాడారో మనం చూశాం. రిటైరైపోయిన వ్యక్తిని ఏవిధంగా ఈసీగా నియమించుకుని 13 జిల్లాల్లో డిపాజిట్లు రావని నిర్ధారించుకుని… కనీసం హెల్త్ మినిస్టర్‌తో కానీ, హోం మినిస్టర్‌తో కానీ చర్చించకుండా తానే అన్నీ అన్నట్టుగా ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎన్నికలైపోయిన తరువాత ఈసీ బాధ్యత తీసుకోదు.. ప్రజల బాధ్యత తీసుకునే ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడాన్ని ప్రజలు ఆగ్రహిస్తున్నారంటూ పేర్కొన్నారు.

దీనిని టీవీ ఛానెళ్లు ప్రముఖంగా ప్రచారం చేయడంతో రోజా నవ్వులపాలవుతున్నారు. రాజకీయ నాయకులింతే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం రోజా రాజకీయాల్లో కూడా జబర్దస్త్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

tags : roja, ysrcp, apiic chairperson, mla roja, social media video, viral video, local body elections

Tags:    

Similar News