భారత్‌తో కలిసి పని చేస్తున్నాం: వాషింగ్టన్ పోస్ట్ నివేదికపై యూఎస్ స్పందన
ఖలిస్థాన్ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను అమెరికాలో హత్య చేసేందుకు భారత్ కుట్ర పన్నిందంటూ వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అమెరికా స్పందించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థాన్ వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను అమెరికాలో హత్య చేసేందుకు భారత్ కుట్ర పన్నిందంటూ వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై అమెరికా స్పందించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తులో భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించింది. భారత ప్రభుత్వం నుంచి జవాబుదారీ తనం ఆశిస్తున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి వేదాంత్ పటేల్ తెలిపారు. ‘భారతీయ విచారణ కమిటీతో కలిసి పని చేస్తున్నాం. ఈ అంశంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. ఏ సమస్య ఉన్నా నేరుగా భారత ప్రభుత్వానికి మా ఆందోళనలను తెలియజేస్తాం’ అని పేర్కొన్నారు. భారత్-అమెరికాలు తమ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
కాగా, గురుపత్వంత్ హత్యకు భారత్ కుట్ర పన్నిందని వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని వెల్లడించింది. ఈ చర్యకు భారత్ గూఢచార సంస్థ ‘రా’ కూడా అనుమతించిందని పేర్కొంది. అంతేగాక ఈ విషయం ప్రధాని మోడీ సన్నిహితులకు సైతం తెలుసని తెలిపింది. ఈ కథనాన్ని భారత్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని తెలిపింది. అవి ఎంతగానూ ఉపయోగకరం కాదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికా స్పందించడం గమనార్హం.