Gaza: గాజాలో పిల్లల కోసం 10 లక్షల పోలియో వ్యాక్సిన్‌లు: WHO
ఇటీవల గాజా ప్రాంతాల్లోని మురుగునీటిలో పోలియో కారక వైరస్ జాడలు
దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల గాజా ప్రాంతాల్లోని మురుగునీటిలో పోలియో కారక వైరస్ జాడలు కనుగొన్న నేపథ్యంలో ఇది పిల్లలకు సోకకుండా నిరోధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రాబోయే వారాల్లో గాజాకు 10 లక్షల కంటే ఎక్కువ పోలియో వ్యాక్సిన్‌లను పంపుతున్నట్లు దాని చీఫ్ శుక్రవారం తెలిపారు. డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ, పోలియో కేసులు ఇంకా నమోదు కానప్పటికీ, ఎలాంటి జాగ్రత్తలు, రక్షణ లేకుండా ఉన్నటువంటి పిల్లలను కాపాడటానికి వ్యాక్సిన్‌లను అక్కడికి పంపాలని నిర్ణయించాం. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వైరల్ వ్యాధి నుండి చాలా ప్రమాదంలో ఉన్నారు, ముఖ్యంగా రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులు కూడా ఎక్కువగా ఉన్నారు. వారందరిని పోలియో కారక వైరస్ నుంచి రక్షించడానికి యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలను ప్రారంభించామని చెప్పారు.
అంతకుముందు ఎన్‌క్లేవ్‌లోని పరీక్ష నమూనాలలో వైరస్ అవశేషాలు కనుగొనబడ్డాయి. దాంతో గాజా స్ట్రిప్‌లో పనిచేస్తున్న సైనికులకు పోలియో వ్యాక్సిన్‌ను అందించడం ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ సైన్యం కూడా తెలిపింది. గాజాలో పారిశుద్ధ్య పరిస్థితులు క్షీణించడంతో హెపటైటిస్ A, విరేచనాలు, గ్యాస్ట్రోఎంటెరిటిస్ కేసులు విస్తృతంగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి నివేదించింది.