Gaza polio virus: గాజాలో పోలియో మహమ్మారి.. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన

గత కొంత కాలంగా యుద్ధంతో అల్లాడిపోతున్న గాజాలో తాజాగా పోలియో మహమ్మారి తిరిగి మొదలైంది.

Update: 2024-07-31 13:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గత కొంత కాలంగా యుద్ధంతో అల్లాడిపోతున్న గాజాలో తాజాగా పోలియో మహమ్మారి తిరిగి మొదలైంది. దాని వైరస్ జాడలు అక్కడి ప్రాంతాల్లో కనుగొనబడ్డాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ వెంటనే అక్కడ నివారణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్‌ సైనిక చర్య వల్ల ఆ ప్రాంతంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో తిరిగి పోలియో కారక వైరస్ పునరుజ్జీవనం చెందింది. అక్కడి మురుగు నీటి నమూనాల్లో CPV2 రకం కనిపించిందని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.

యుద్ధం కారణంగా అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇప్పుడు ఈ పోలియో జాడలు కనుగొనడంతో పిల్లలు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నారు. తక్షణం నివారణ చర్యలు ప్రారంభించాలి. ఇంకా ఆలస్యం అయితే వైరస్ పిల్లల శరీరాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గాజా ఆరోగ్య శాఖ పోలియో వైరస్ జాడలు కనిపెట్టినట్టు ప్రకటించినప్పటికి కేసులు వచ్చినట్టు మాత్రం ఇంకా ప్రకటించలేదు.

కొద్ది రోజుల క్రితం పిల్లలు ఈ వ్యాధి బారిన పడకుండా నిరోధించడానికి రాబోయే వారాల్లో 10 లక్షల కంటే ఎక్కువ పోలియో వ్యాక్సిన్‌లను గాజాకు పంపుతామని టెడ్రోస్ ప్రకటించగా, తాజాగా పరిస్థితులు మరింత క్షీణిస్తున్న తరుణంలో ఈ చర్యలను మరింత వేగవంతం చేశారు. 1988 నుండి ప్రపంచవ్యాప్తంగా పోలియో కేసులు 99% తగ్గాయి. దానిని నిర్మూలించడానికి గతంలో సామూహిక టీకా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడంతో పోలియో కేసులు తగ్గిపోగా, ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గాజాలో తిరిగి వైరస్ పునరుజ్జీవనం చెందింది.

Tags:    

Similar News