ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణకు యూఎస్ కొత్త ప్రతిపాదన..ఏమిటది?

ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తపరిస్థితులను తగ్గించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ప్రతిపాదనలు ప్రకటించారు.

Update: 2024-06-01 04:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తపరిస్థితులను తగ్గించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ప్రతిపాదనలు ప్రకటించారు. ఇందులో కాల్పుల విరమణ, హమాస్ చేతిలో ఉన్న బందీల విడుదల కూడా ఉన్నాయి. బైడెన్ ప్రతిపాదనలో మూడు దశలు ఉంటాయి. మొదటి దశ ఆరు వారాల పాటు కొనసాగుతుంది. దీనిలో భాగంగా గాజాలోని జనావాస ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వస్తాయి. అంతేగాక హమాస్ తమ వద్ద ఉన్న మహిళలు, వృద్ధ ఇజ్రాయెలీ బందీలను రిలీజ్ చేయాలి. అలాగే ఇజ్రాయెల్ సైతం తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా బంధీలను కూడా విడుదల చేయాలి. పాలస్తీనా పౌరులు గాజా అంతటా వారి ఇళ్లు, పొరుగు ప్రాంతాలకు తిరిగి రావడానికి అనుమతిస్తారు.

రెండో దశలో సైనికులతో సహా ఇజ్రాయెల్ బందీలందరినీ హమాస్ విడుదల చేయాలి. ఇజ్రాయెల్ దళాలు గాజాను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆరు వారాల పాటు కొనసాగుతుంది. ఇక మూడో దశలో భాగంగా చనిపోయిన బందీల మృతదేహాలు తిరిగి ఇవ్వాలి. అలాగే గాజా పునర్నిర్మాణానికి 3 నుంచి 5 సంవత్సరాల ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఒప్పందం ప్రకారం హమాస్ మరోసారి నిబంధనలు పాటించడంలో విఫలమైతే ఇజ్రాయెల్ తమ సైనిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించొచ్చని బైడెన్ చెప్పారు. ఈ ప్రతిపాదనల ఆమోదానికి యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్ ఖతార్‌లు మధ్యవర్తిత్వం వహిస్తాయని తెలిపారు.

సానుకూలంగా స్పందించిన ఇజ్రాయెల్-హమాస్?

అమెరికా ప్రతిపాదనలకు ఇజ్రాయెల్ హమాస్ లు అంగీకరించినట్టు పలు కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు ఎనిమిది నెలల యుద్ధానికి ముగింపు పలకాలని కోరుతూ బైడెన్ ప్రకటించిన పూర్తి గాజా కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్ రోడ్‌మ్యాప్‌ను సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ కొత్త కాల్పుల విరమణ ప్రణాళికను అంగీకరించిందని బైడెన్ తెలిపారు. అయితే ఇజ్రాయెల్-హమాస్ లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 


Similar News