ట్రంప్ సంపద సగానికి సగం ఢమాల్.. ఏమైంది ?
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు.
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఆయనకు అమెరికా సహా చాలా దేశాల్లో అతిపెద్ద హోటళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. అయితే గత ఏడేళ్లలో ఆయన సంపద 46 శాతం ఆవిరైంది. అంటే.. దాదాపు సగానికి సగం ట్రంప్ సంపద హుష్ కాకి అయింది. ప్రత్యేకించి ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి (2020 సంవత్సరంలో) పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి సంపద వేగంగా తగ్గుముఖం పట్టింది. ‘ఫోర్బ్స్’ మేగజైన్ నివేదిక ప్రకారం.. అమెరికా రియల్ ఎస్టేట్ బిలియనీర్ డొనాల్డ్ ట్రంప్ 2016 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు తన సంపదలో 46 శాతం కోల్పోయారు. ప్రస్తుతం ట్రంప్ వద్ద రూ.21వేల కోట్ల సంపద ఉంది. 2016 నాటితో పోలిస్తే ఇది సగానికి సగమే కావడం గమనార్హం. ప్రత్యేకించి కరోనా సంక్షోభం తర్వాత ట్రంప్‌కు చెందిన అమెరికాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. వాటి విలువ దాదాపు రూ.1000 కోట్లు తగ్గిపోయింది. న్యూయార్క్‌లోని మ్యాన్ హట్టన్‌లో ఉన్న అతిపెద్ద వాణిజ్య సముదాయం ‘1290 అవెన్యూ ఆఫ్ ది అమెరికాస్’లో ట్రంప్‌కు దాదాపు రూ.4వేల కోట్ల విలువైన వాటా ఉంది. దాని విలువ కూడా డౌన్ అయిందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి. ట్రంప్ వద్ద దాదాపు రూ.4900 కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నాయి. ట్రంప్‌కు చెందిన నేషనల్ డోరల్ మయామి గోల్ఫ్ రిసార్ట్ విలువ దాదాపు రూ.2400 కోట్లు ఉంటుందని అంటారు. ఇందులో జరిగే వ్యాపార కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయట.
కోర్టు కేసుల పిడుగు
* డొనాల్డ్ ట్రంప్‌ను గత రెండేళ్లలో కోర్టు కేసులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. పలు కేసుల్లో ఆయన వేల కోట్ల జరిమానాలను ఎదుర్కొన్నారు.
* గత నెలలో ఓ కేసును విచారించిన న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ కోర్టు న్యాయమూర్తి రూ.2900 కోట్లకుపైగా జరిమానాను విధించారు.
* అంతకుముందు నెలలో పరువు నష్టానికి సంబంధించిన ఓ కేసులో ఇదే కోర్టు రూ.687 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది.
* అత్యాచారం ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్టు కారోల్‌కు రూ.41 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని అంతక్రితం ట్రంప్‌ను కోర్టు ఆదేశించింది.
* ఈ ఆదేశాలను పైకోర్టుల్లో ట్రంప్ అప్పీల్ చేశారు. ఒకవేళ అక్కడ కూడా ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలితే ఈ భారీ మొత్తాలను చెల్లించాల్సి వస్తుంది. అదే జరిగితే ట్రంప్ సంపద విలువ ఇంకా తగ్గిపోతుంది.