యుద్ధంలో గెలవడానికి అణ్వాయుధాలు అవసరం లేదు: రష్యా అధ్యక్షుడు పుతిన్

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో గెలవడానికి అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నొక్కి చెప్పారు.

Update: 2024-06-08 08:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో గెలవడానికి అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నొక్కి చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణ అణు యుద్ధంగా మారకూడదని ఆశిస్తున్నట్టు తెలిపారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‌లో పుతిన్ ప్రసంగించారు. రష్యా సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని, విజయానికి అణ్వాయుధాల అవసరం రాదని చెప్పారు.

ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించారు. రష్యా అణుసిద్ధాంతంలో అవసరం అయినప్పుడు మాత్రమే మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, రష్యా అవసరమైతే అణ్వాయుధాలను ఉపయోగిస్తుందని పుతిన్ ఇటీవల పదేపదే చెప్పడంతో పాశ్చాత్య దేశాలు ఆందోళన చెందాయి. అయితే తాజా పుతిన్ వ్యాఖ్యలతో అణు యుద్ధం కోరుకోవడం లేదని చెప్పడంతో కొస్తా ఆందోళన తగ్గినప్పటికీ పుతిన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


Similar News