US President Elections : ప్రజా అవసరాలపై దృష్టి పెట్టండి.. కమలా హారిస్ జాతిపై కాదు : నిక్కీ హేలీ
అగ్రరాజ్యం అమెరికాలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికాలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో.. రిపబ్లికన్ మాజీ అధ్యక్ష అభ్యర్థి, సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ రిపబ్లికన్ పార్టీకి కొన్ని సలహాలు ఇచ్చారు. రిపబ్లికన్లు డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హరీస్ పై విమర్శలు గుప్పించడం మానేసి, దానికి బదులుగా అమెరికా ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాలని తోటి రిపబ్లికన్‌లకు కోరారు. పలు కీలకమైన రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్‌పై హారిస్ పట్టు సాధిస్తున్న తరుణంలో నిక్కీ హేలీ ఇలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మంగళవారం ఫాక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్‌లో పాల్గొనబోతున్న సందర్బంగా నిక్కీ హేలీ మాట్లాడూతూ..ఈ ఏడాది ఎన్నికలలో హారిస్ పోటీ చేయడం గురించి విసుక్కోవడం మానేయండని, అలాగే ట్రంప్ ప్రచార బృందం హారిస్ జాతిపై, ఆమె సామర్థ్యాలపై విమర్శలు చేయడం కంటే ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాలని హేలీ రిపబ్లికన్లకు, ట్రంప్‌కు సూచించారు. US ఎన్నికలకు దాదాపు మూడు నెలల ముందు డెమొక్రాట్‌లు, రిపబ్లికన్లు ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో పరస్పరం మాటల దాడి చేసుకుంటున్న సమయంలో హేలీ రిపబ్లికన్లకు ఇలా సలహా ఇవ్వడం విశేషం. కాగా డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకుంటాడని నిక్కీ హేలీ ముందే ఊహించి చెప్పింది. ఆమె ఊహించినట్టే జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నారు.