Air Force chief: చైనా, పాక్ సైనికీకరణ ఆందోళన.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆందోళన
సరిహద్దుల్లో చైనా, పాక్ సైనికీకరణపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్(Air Chief Marshal AP Singh) ఆందోళన వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దుల్లో చైనా, పాక్ సైనికీకరణపై ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్(Air Chief Marshal AP Singh) ఆందోళన వ్యక్తం చేశారు. 21వ సుబ్రోతో ముఖర్జీ సెమినార్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉత్తర, పశ్చిమ సరిహద్దులో చైనా, పాక్ బలగాలు వేగంగా మోహరిస్తున్నాయని అన్నారు. చైనా తన వైమానిక దళంపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. ఇటీవలే బీజింగ్ సరికొత్త స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. సంఖ్యాపరంగానే కాదు.. సాంకేతికంగానూ చైనా అభివృద్ధి చెందడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు.
స్వదేశీ ప్రాజెక్టుల జాప్యంపై ఆందోళన
అంతేకాకుండా స్వదేశీ ప్రాజెక్టుల జాప్యంపై ఏపీ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తేజస్ మార్క్-1A ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. అణెరికా నుంచి జీఈ- ఎఫ్ 404 (GE-F404) జెట్ ఇంజిన్‌ల సరఫరా నెమ్మదిగా సాగుతోందని.. అది అవరోధంగా మారిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు గుర్తుచేశారు. స్వయంశక్తిగా మారేందుకు వైమానిక దళం చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేశారు. ఎంఎస్ఎంఈల (MSME) ల సహకారంతో దాదాపు 50 వేల విడిభాగాలను తయారు చేసినట్లు తెలిపారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పలు పథకాలు ప్రవేశపెట్టమన్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D)లో రిస్క్‌లను స్వీకరించాల్సిన అవసరాన్ని ఎయిర్ ఫోర్స్ చీఫ్ నొక్కి చెప్పారు.