Russia: రష్యా రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపై సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు రష్యా దౌత్య సిబ్బంది సహా 10 మంది మృతి చెందారు.
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయంపై సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు రష్యా దౌత్య సిబ్బంది సహా 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలైనట్లు సమాచారం. రష్యా రాయబార కార్యాలయంలో మానవబాంబు పేలుడు ఘటన సంభవించిందని కాబూల్ భద్రతా విభాగం అధికార ప్రతినిధి జలీద్ జద్రాన్ తెలిపారు. అతడిని అడ్డుకోవడానికి భద్రత బలగాలు ప్రయత్నించాయని, కానీ అప్పటికే పేలుడు సంభవించిందన్నారు. ఈ మేరకు ఘటనా స్థలంలో భద్రతా బలగాలు మోహరించాయన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు జలీద్ జద్రాన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సహాయక మిషన్ (యూఎన్‌ఏఎంఏ) ఖండించింది.
కాబూల్ వరుస దాడులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించింది. కాగా, ఇటీవల కాబూల్‌లో బాంబు పేలుళ్ల ఘటనలు భారీగా పెరిగాయి. ఈ నెలలోనే కాబూల్‌లోని ఓ మసీదులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా.. 200 మంది గాయపడినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. మృతుల్లో ప్రముఖ మత నాయకుడు ముజిబ్ ఉల్ రహమాన్ అన్సారీ కూడా ఉన్నారు. అలాగే హెరాత్ నగరంలోని గుజర్గా మసీదులో కూడా బాంబు పేలుడు చోటు చేసుకుంది. ప్రార్థన సమయంలో మసీదులకు వచ్చే భక్తులనే టార్గెట్ చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Also Read : ఆధారాలు చూపండి.. యూఎస్‌కు రష్యా ఛాలెంజ్..