రష్యా ఆధీనంలోని ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడి..26 మంది మృతి

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు. రోజు రోజుకూ మరింత ఉధృతమవుతోంది. తాజాగా రష్యా ఆధీనంలో ఉన్న లుగాన్స్క్, ఖేర్సన్ ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడులు చేసింది.

Update: 2024-06-08 04:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు. రోజు రోజుకూ మరింత ఉధృతమవుతోంది. తాజాగా రష్యా ఆధీనంలో ఉన్న లుగాన్స్క్, ఖేర్సన్ ప్రాంతాలపై ఉక్రెయిన్ దాడులు చేసింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా 15 మంది గాయపడ్డారు. దక్షిణ ఖేర్సన్‌లోని సడోవ్ గ్రామంలో పెద్ద సంఖ్యలో సందర్శకులు, ఉద్యోగులతో ఉన్న ఒక దుకాణం పూర్తిగా ధ్వంసమైందని ఖేర్సన్‌లోని రష్యన్ అధిపతి వ్లాదిమిర్ సాల్డో వెల్లడించారు. ఈ అటాక్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పాశ్యాత్య దేశాలు అందించిన ఆయుధాలతోనే ఉక్రెయిన్ ఈ దాడికి పాల్పడిందని ఆరోపించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ఉక్రేనియన్ బలగాలు ఉద్దేశపూర్వకంగానే రెండోసారి ఆ ప్రాంతాన్ని తాకాయని, అమెరికా అందించిన హిమార్స్ క్షిపణిని ఉపయోగించి దాడికి పాల్పడ్డాయని అందుకే ప్రాణనష్టం అధికంగా ఉందని చెప్పారు. అంతకుముందు లుగాన్స్క్‌లోతూర్పు ప్రాంతంలోని ప్రధాన నగరంలో అపార్ట్‌మెంట్ బ్లాక్‌పై ఉక్రేనియన్ క్షిపణి దాడి చేయగా నలుగురు మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారని గవర్నర్ లియోనిడ్ పసెచ్నిక్ తెలిపారు. యుఎస్ సరఫరా చేసిన క్షిపణులను దాడిలో ఉపయోగించాయని చెప్పారు.

అయితే ఈ రెండు ఘటనలపై ఉక్రెయిన్ అధికారికంగా స్పందించలేదు. కాగా, 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించాక రష్యన్ దళాలు ఖేర్సన్ ప్రాంతంలోకి ప్రవేశించాయి. అనంతరం పలు నగరాలను స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఉక్రేనియన్ దళాలు అదే ఏడాది ఖేర్సన్‌ను తిరిగి స్వాధీనం చేసుకోగా.. ఇతర ప్రాంతాలు రష్యా దళాల చేతుల్లోనే ఉన్నాయి. 


Similar News