Ukraine: న్యూక్లియర్ కేంద్రాలపై దాడికి రష్యా ప్రయత్నం.. ఉక్రెయిన్ సంచలన ఆరోపణలు
తమ దేశంలోని అణు కేంద్రాలపై దాడి చేసేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ మంత్రి ఆండ్రీ సైబిహా ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: శీతాకాలానికి ముందు తమ దేశంలోని అణు కేంద్రాలపై దాడి చేసేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా ఆరోపించారు. ఈ అటాక్ చేయకుండా రష్యాను నియంత్రించాలని ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చారు. దేశంలోని అణు కర్మాగారాల వద్ద శాశ్వత పర్యవేక్షణ మిషన్లను ఏర్పాటు చేయాలని అమెరికా సహా తమ మిత్రదేశాలను కోరారు. ‘ఉక్రేనియన్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. న్యూక్లియర్ ఎనర్జీకి కీలకమైన వస్తువులపై దాడులకు రష్యా సిద్ధమవుతోంది. అణు విద్యుత్ ప్లాంట్లే లక్ష్యంగా అటాక్ చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. ప్రత్యేకించి ట్రాన్స్‌మిషన్ సబ్‌స్టేషన్, ఓపెన్ డిస్ట్రిబ్యూషన్, కీలక పరికరాలకు సంబంధించిన వాటిని లక్ష్యంగా చేసుకోబోతోంది’ అని పేర్కొన్నారు. ఈ దాడి వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని, దాని ప్రభావం ప్రపంచం మొత్తంపై పడే చాన్స్ ఉందని వెల్లడించారు. కాబట్టి దీనిని ఆపివేసేలా చూడాలని అంతర్జాతీయ దేశాలకు విజ్ఞప్తి చేశారు.