'రష్యాతో సంధికి సిద్ధం, నాటో సభ్యత్వం వద్దు': ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ
Ukraine gives up on joining NATO, says compromising with Russia.
దిశ, వెబ్‌డెస్క్ః రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధంలో రెండు వారాల తర్వాత సంచలనాత్మకమైన సంధి ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్ ఇకపై నాటో (NATO) సభ్యత్వాన్ని కోరట్లేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా ప్రకటించారు. నిజానికి, ఈ యుద్ధానికి గల ముఖ్య కారణాల్లో ఉక్రెయిన్ నాటోలో చేరతాననడం ఒకటి. దీనితో పాటు జెలెన్స్కీ మరో కీలక ప్రకటన కూడా చేశారు. ఫిబ్రవరి 24న దాడికి ముందు పుతిన్ స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించిన ఉక్రెయిన్‌లోని రెండు రష్యా అనుకూల భూభాగాలు డొనెట్స్క్, లుగాన్స్క్‌లపై "రాజీ"కి తాను సిద్ధంగా ఉన్నానని జెలెన్స్కీ చెప్పారు.
అయితే, జెలెన్స్కీ ఈ సందర్భంగా మరో సంచలన ప్రకటన చేశారు. "మోకాళ్లపై నిలబడి అడుక్కునే దేశానికి" తాను అధ్యక్షుడిగా ఉండాలనుకోలేదని అన్నారు. యుద్ధంలో తనకు సహాయం కావాలని అర్థించినా కూడా నాటో దానిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోవడం వల్ల జెలెన్స్కీ ఇలా స్పందించారు. ఇక రష్యాతో మొదటి నుంచి చెప్పినట్టే చర్చకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా జెలెన్స్కీ వెల్లడించారు. ఈ పరిణామంతో ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధ తీవ్రత చల్లారుతుందని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది.