రష్యాపై దాడిలో ఉక్రెయిన్ ప్రమేయం లేదు: అమెరికా

రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ కాన్సర్ట్ హాల్‌పై జరిగిన ఉగ్రదాడితో ఉక్రెయిన్‌కు ఎటువంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది.

Update: 2024-03-26 04:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా రాజధాని మాస్కోలోని క్రోకస్ కాన్సర్ట్ హాల్‌పై జరిగిన ఉగ్రదాడితో ఉక్రెయిన్‌కు ఎటువంటి సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ ప్రమేయం ఉందనడానికి ఎటువంటి ఆధారాలూ లేవని తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘ఉగ్రదాడికి పాల్పడింది ఐసిస్ సంస్థేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ అర్థం చేసుకున్నారు. ఈ విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. దీనితో ఉక్రెయిన్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. అందుకు ఆధారాలు కూడా లేవు’ అని ఆమె వ్యాఖ్యానించారు. మాస్కోలో అమాయక పౌరులపై జరిగిన దాడిని ఇప్పటికీ తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నామని వెల్లడించారు. దీనికి ఐసిసే పూర్తి బాధ్యత వహిస్తుందని తెలిపారు. మార్చి 7వ తేదీనే రష్యాలోని అమెరికన్లకు దాడిపై అడ్వైజరీ జారీ చేశామని గుర్తు చేశారు.

ఈ నెల 22న మాస్కోలోకి క్రాకస్ సిటి హాలులో నిందితులు ఉగ్రదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 137 మంది మరణించగా..మరో 120 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఉగ్రసంస్థ ఐసిస్ ప్రకటించింది. దీనిని అమెరికా సైతం ధ్రువీకరించింది. అయితే ఈ అటాక్‌తో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. దాడి తర్వాత నిందితులు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ దాడిని బెదిరింపు చర్యగా అభివర్ణించారు. పుతిన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ సైతం ఖండించగా తాజాగా యూఎస్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. మరోవైపు రష్యాలోని మాస్కోలో జరిగిన ఉగ్రవాద దాడిని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఖండించారు. రష్యాకు అమెరికా అండగా నిలుస్తుందని తెలిపారు.

Tags:    

Similar News