Bangladesh: షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు నో చెబుతున్న యూకే..!

బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల మధ్య షేక్‌ హసీనా ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు.

Update: 2024-08-06 17:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల మధ్య షేక్‌ హసీనా ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నారు. అయితే ఆమె ఇక్కడి నుంచి యూకే వెళ్లాలని ప్లాన్ చేసుకోగా, దానికి అటువైపు నుంచి సానుకూల సమాధానం రానట్లుగా తెలుస్తుంది. ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకు యూకే నిరాకరిస్తున్నట్లు సమాచారం. యూకే హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాజాగా మాట్లాడుతూ, అవసరమైన వ్యక్తులకు రక్షణ కల్పించడంలో యూకే గర్వించదగిన రికార్డును కలిగి ఉంది. అయితే, ఆశ్రయం లేదా తాత్కాలిక ఆశ్రయం పొందేందుకు ఎవరైనా ఇక్కడికి వచ్చేందుకు అనుమతించే నిబంధన ప్రత్యేకంగా లేదు. అంతర్జాతీయ రక్షణ అవసరం ఉన్నవారు, తాము చేరుకున్న మొదటి సురక్షిత దేశంలో ఆశ్రయం పొందాలని అన్నారు. అయితే ప్రస్తుతం ఆమె భారత్‌లో ఉండగా, తరువాత కూడా భారత్‌లోనే ఆశ్రయం పొందాలనే ఉద్దేశంతో యూకే హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడినట్లుగా ఉంది.

అయినప్పటికి కూడా హసీనా, యూకేలోనే ఆశ్రయం పొందాలనే ఆలోచనతో అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. దీంతో షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం పట్ల యూకే హోం మంత్రిత్వ శాఖ తర్జనభర్జన పడుతోంది. హసీనా చెల్లెలు షేక్ రెహానా యూకే పౌరసత్వం కలిగి ఉంది, ఇది ఆ దేశంలో ఆశ్రయం పొందేందుకు ఉపయోగపడుతుంది. అలాగే, ఆమె మేనకోడలు తులిప్ సిద్ధిక్ బ్రిటిష్ లేబర్ పార్లమెంటేరియన్. ప్రస్తుతం యూకేలో లేబర్‌ పార్టీనే అధికారంలో ఉండటంతో బ్రిటన్‌ ప్రభుత్వాన్ని హసీనా ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. అయితే ఆమె చేసిన అభ్యర్థన ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. దీనిపై అతి త్వరలో ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Tags:    

Similar News