Typhoon Yagi: మయన్మార్‌లో యాగీ తుఫాన్ విధ్వసం..226 మంది మృతి,పలువురు గల్లంతు
మయన్మార్(Myanmar)లో యాగీ తుఫాన్(Typhoon Yagi)బీభత్సం సృష్టిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్:మయన్మార్(Myanmar)లో యాగీ తుఫాన్(Typhoon Yagi)బీభత్సం సృష్టిస్తోంది.మొన్నటి వరకు వియత్నాం(Vietnam)దేశాన్ని వణికించిన ఈ తుఫాన్ ఇప్పుడు మయన్మార్(Myanmar)పై విరుచుకుపడుతోంది.యాగీ తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది.భారీ వరదలు సంభవించడంతో పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 226 మంది మృతి చెందగా మరో 77 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. లక్షలాది ప్రజలు తాము ఉంటున్న ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు.ఈ తుఫాన్ వల్ల ఇప్పటికే 6.30 లక్షల మంది ప్రభావితం అయ్యారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (UNOCHA) విపత్తు సంస్థ తెలిపింది.
ఈ తుఫాన్ కారణంగా ముఖ్యంగా రాజధాని నేపిడావ్(Naypyidaw) ప్రాంతంతో పాటు కయా, కయిన్ అలాగే షాన్(Kayah, Kayin and Shan) రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఆహారం, తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. మయన్మార్ చరిత్రలో ఇంతటి దారుణ తుఫాన్ రాలేదనీ.. అత్యంత దారుణ వరదలు ఇవేని UN చెప్పింది. మయన్మార్‌లో వరదల ధాటికి ఇప్పటివరకు 2,60,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రహదారుల వంటి మౌలిక సౌకర్యాలు దెబ్బతిన్నాయి. మరోవైపు వరద బాధితులకు సహాయం చేయాలన్నా వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ఈ క్రమంలోనే తమకు సాయం చేయడానికి ముందుకు రావాలని మయన్మార్ సైనిక పాలక వర్గం పలు దేశాలని కోరింది.కాగా యాగీ తుఫాన్ చైనా, వియత్నాం, థాయ్ లాండ్, లావోస్(China, Vietnam,Thailand And Laos) దేశాలలోనూ విధ్వంసం సృష్టించింది.యాగీ తుఫాన్ కారణంగా ఒక్క వియత్నాంలోనే 300 మంది వరకు చనిపోయారు.