రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. తొమ్మిది బోగీలు బోల్తా

రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కోమి ప్రాంతంలో బుధవారం ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది.

Update: 2024-06-27 03:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కోమి ప్రాంతంలో బుధవారం ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. దీంతో తొమ్మిది బోగీలు బోల్తా పడడంతో దాదాపు 70 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించలేదని సమాచారం. రైలు 511లో మొత్తం 14 బోగీలు ఉండగా, వాటిలో 215 మంది ప్రయాణికులు ఉన్నారు. రైలు వోర్కుటా నగరం నుండి ఆర్కిటిక్ సర్కిల్ మీదుగా దక్షిణాన నల్ల సముద్రంలోని నోవోరోసిస్క్ నౌకాశ్రయానికి వెళుతోంది. ఇది దాదాపు 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. దీనికి దాదాపు ఐదు రోజులు పడుతుంది.

ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 6.12 గంటలకు కోమి రిపబ్లిక్‌లోని ఇంటా అనే చిన్న పట్టణం సమీపంలో ఇది పట్టాలు తప్పింది. ప్రమాద సమాచారాన్ని అందుకున్న వెంటనే రైల్వే అధికారులు  రెండు సహాయక రైళ్లు, రక్షణ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం అడవితో కూడుకుంది. కష్టతరంగా ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు. ఆ మార్గంలో వెళ్లాల్సిన ఇతర రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే ప్రమాదానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలే రైలు పట్టాలు తప్పడానికి కారణమని కొంతమంది ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News