Monkey pox: పాకిస్తాన్‌లో మంకీ పాక్స్.. మూడు కేసులు నమోదు
మహమ్మారిగా మారిన మంకీ పాక్స్ క్రమంగా పలు దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా పాకిస్తాన్‌లో కూడా మూడు కేసులు నమోదు అయినట్లు ఆ దేశ ఆరోగ్య విభాగం ఆగస్టు 16న ఒక ప్రకటనలో తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: మహమ్మారిగా మారిన మంకీ పాక్స్ క్రమంగా పలు దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా పాకిస్తాన్‌లో కూడా మూడు కేసులు నమోదు అయినట్లు ఆ దేశ ఆరోగ్య విభాగం ఆగస్టు 16న ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తర ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. వ్యాధి బారిన పడిన ఈ ముగ్గురు ఇటీవల ఆగస్టు 3న సౌదీ అరేబియా నుండి వచ్చినట్లు గుర్తించారు. అనారోగ్యంగా ఉండటంతో వారి నమూనాలను సేకరించి వైద్య పరీక్ష నిర్వహించగా, మంకీ పాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వీరిని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచారు. అలాగే, వారితో పాటు ప్రయాణించిన వారి వివరాలను సేకరించి వారికి కూడా టెస్ట్‌లు చేస్తున్నారు.
122 దేశాల్లో మంకీ పాక్స్ కేసులు వెలుగుచూశాయి. దీంతో వ్యాప్తి, ప్రభావం దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రెండేళ్ల క్రితం ఆఫ్రికా దేశాల్ని కుదిపేసిన మంకీ పాక్స్, ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది, ప్రస్తుతం ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఫ్రికాలో దాదాపు 10 వేల కంటే ఎక్కువ మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా 500 మందికి పైగా చనిపోయారు. గత ఏడాదితో పోలిస్తే కేసులతో పాటు మరణించిన వారి సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
స్వీడన్‌లో కూడా తొలి మంకీపాక్స్ కేసు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు మంకీపాక్స్ కొత్త వేరియెంట్‌లో కనిపిస్తోంది. శరీరంలోకి సోకిన తర్వాత ఆరంభంలోనే ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించడం వైద్యులకి కూడా కష్టం అవుతోంది. దాంతో వ్యాధి సోకిన వారు తమకి తెలియకుండానే ఇతరులకు ఈ ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపింపజేస్తున్నారు. కొత్త వేరియంట్ ద్వారా బాధితులకి ఎక్కువగా చాతీ, చేతులు, కాళ్లపై గాయాలు కనిపిస్తాయి.