ఈ సారి ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్

ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడితే ఈసారి ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ హెచ్చరించారు.

Update: 2024-04-20 03:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ మరోసారి దాడికి పాల్పడితే ఈసారి ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ హెచ్చరించారు. ఇరాన్‌పై జరిగిన దాడిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. డ్రోన్లు ఇరాన్ లోపల నుంచి ప్రయోగించబడి కొన్ని వందల మీటర్ల దూరం ప్రయాణించాయని, వాటన్నింటినీ కూల్చేశామని తెలిపారు. డ్రోన్లు తమ పిల్లలు ఆడుకునే బొమ్మల వంటివని అభివర్ణించారు. అయితే ఇరాన్‌పై ప్రయోగించబడిన డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు సంబంధం ఉందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని తెలిపారు. కానీ దీనిపై దర్యాప్తు చేపట్టామని..అది ఇజ్రాయెల్ పని అని తేలితే మాత్రం ఖచ్చితంగా బదులిస్తామని హెచ్చరించారు.

ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే తక్షణమే ప్రతిస్పందిస్తామని అమీర్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లో అతిపెద్ద నగరమైన ఇస్సహాన్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా స్పందించలేదు. స్థానిక కథనాలు మాత్రం ఇది ఇజ్రాయెల్ పనేనని వెల్లడించాయి. ఈ దాడిలో భారీ నష్టమేమీ జరగనప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ మరోసారి ప్రతిస్పందిస్తామని తెలపడంతో పశ్చిమాసియాలో ఆందోళనలు మరింత పెరగనున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఈ నెల1న సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి అనంతరం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని ఇరాన్ వెల్లడించింది. ఈ క్రమంలోనే మరోసారి ఇరాన్‌పై దాడి జరగడం గమనార్హం. 

Tags:    

Similar News