కోర్టు హాల్ లోనే జడ్జిని కాల్చి చంపిన పోలీస్ అధికారి
అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఈ సారి ఏకంగా కోర్టు హాల్ లోనే జడ్జి బలయ్యాడు.
దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఈ సారి ఏకంగా కోర్టు హాల్ లోనే జడ్జి బలయ్యాడు. కెంటకీ రాష్ట్రంలోని లెట్చర్ కౌంటీలోని వైట్స్ బర్గ్ జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న 54 ఏళ్ల జిల్లా జడ్జి కెవిన్ ములిన్ ను ఆయన ఛాంబర్లోనే పోలీస్ అధికారి లెట్చర్ కౌంటీ షరీఫ్ షాన్ ఎం. స్టెయిన్స్ కాల్చిచంపాడు. కాల్పులు జరిగినప్పుడు కోర్టులో దాదాపు 50 మంది ఉన్నారు. కెంటకీ రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి మ్యాట్ గేహార్ట్ కథనం మేరకు గత ఎనిమిదేళ్లుగా అదే కౌంటీలో షరీఫ్ గా పనిచేస్తున్న షాన్ గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైట్స్ బర్గ్ కోర్టు భవనానికి వచ్చి జడ్జి ములిన్ తో విడిగా అత్యవసరంగా మాట్లాడాలని అనుమతి కోరాడు. దీంతో జడ్జి ఆయనను తన ఛాంబరు తీసుకెళ్లి గది తలుపులు మూసేశారు. చాలాసేపు వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని బయట వరండాలో వేచి ఉన్న వ్యక్తులు చెప్పారు. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, తర్వాత షరీఫ్ షాన్ చేతులు పైకెత్తి బయటికొచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఛాంబర్ లోపలికి వెళ్లి చూస్తే బుల్లెట్ల గాయాలతో రక్తమోడి జడ్జి నిర్జీవంగా పడి ఉన్నారని శుక్రవారం వెల్లడించారు. జడ్జిని షరీఫ్ ఎందుకు చంపారనే కారణం ఇంకా తెలియరాలేదు. ఏ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగిందన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. పోలీసులు షరీఫ్ షాన్ స్టెయిన్ ను అరెస్ట్ చేసి హత్యానేరం కింద దర్యాప్తు మొదలుపెట్టారు.