విషాదంగా ముగిసిన విమాన ప్రమాదం..ఆ దేశ ఉపాధ్యక్షుడు మృతి

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం మరువకముందే తాజాగా..మలావీ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు.

Update: 2024-06-11 16:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం మరువకముందే తాజాగా..మలావీ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చిలిమాతో సహా అదే విమానంలో ఉన్న మరో 9 మంది సిబ్బంది సైతం మృతి చెందినట్టు మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ధ్రువీకరించారు. 24 గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత విమాన శకలాలు లభ్యమయ్యాయని తెలిపారు. విమానంలో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మలావీ పొరుగు దేశాలతో పాటు అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు సహాయక చర్యలకు మద్దతు ఇచ్చాయని చెప్పారు.

చిలిమా ప్రయాణిస్తున్న విమానం సోమవారం మలావీ రాజధాని లింగాగ్వే నుంచి బయలుదేరింది. ముజూ సిటీ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని తిరిగి లింగాగ్వేకి తీసుకెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత కాసేపటికే విమానం అదృశ్యమైంది. ఏటీసీ రాడార్‌తో కమ్యూనికేషన్ కట్ అయ్యింది. దీంతో వెంటనే భద్రతా దళాలు రంగంలోకి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే మంగళవారం విప్య పర్వత ప్రాంతాల్లో విమానం కూలిపోయిన ఆనవాళ్లను రెస్య్కూ టీమ్స్ గుర్తించాయి. విమాన ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, నెల రోజుల వ్యవధిలోనే రెండు దేశాలకు చెందిన అగ్రనేతలు ఒకే రీతిలో విమాన ప్రమాదంలో మరణించడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.


Similar News