ఇండోనేషియాలో అగ్ని పర్వతం విస్పోటనం..ఎగిసి పడుతున్న లావా

ఇండోనేషియాలో మరోసారి ఓ అగ్ని పర్వతం బద్దలైంది. ఉత్తర సలవేసి ప్రావీన్సులోని స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్ని పర్వతం మంగళవారం అర్ధరాత్రి ఒకసారి, బుధవారం తెల్లవారుజామున రెండు సార్లు విస్పోటనం చెందింది.

Update: 2024-04-17 07:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండోనేషియాలో మరోసారి ఓ అగ్ని పర్వతం బద్దలైంది. ఉత్తర సలవేసి ప్రావీన్సులోని స్టాటోవోల్కానో మౌంట్ రువాంగ్ అగ్ని పర్వతం మంగళవారం అర్ధరాత్రి ఒకసారి, బుధవారం తెల్లవారుజామున రెండు సార్లు విస్పోటనం చెందింది. దీంతో సుమారు ఒక కిలోమీటర్ ఎత్తుకు లావా ఎగిసిపడినట్టు ఆ దేశ జియోలాజికల్ ఏజెన్సీలు తెలిపారు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే వందల మందిని అధికారులు ఖాళీ చేయించారు. అయితే దీనికి సంబంధించిన ఘటనలో జరిగిన నష్టాన్ని వెల్లడించలేదు. రువాంగ్ ద్వీపంలోని రెండు గ్రామాల నుండి 800 మందికి పైగా ప్రజలను సమీపంలోని తగులాండాంగ్ ద్వీపానికి తరలించినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొ్న్నాయి. అగ్నిపర్వతం నుంచి విరజిమ్ముతున్న పొగ, బూడిద సమీప ప్రాంతాలను కమ్మేశాయని వెల్లడించాయి.

మొదటి విస్పోటనం సమయంలో బూడిద రెండు కిలోమీటర్లు ఎగిసిపడగా.. రెండో విస్పోటనంలో 2.5 కిలోమీటర్ల మేర ఎగిసినట్టు జియోలాజికల్ ఏజెన్సీ అధిపతి ముహమ్మద్ వాఫిద్ తెలిపారు. ఇటీవలి రెండు భూకంపాల తర్వాత రుయాంగ్ వద్ద అగ్నిపర్వత కార్యకలాపాలు పెరిగాయని చెప్పారు. ఈ క్రమంలో సముద్ర మట్టానికి 725 మీటర్ల ఎత్తులో ఉన్న అగ్నిపర్వతానికి హెచ్చరిక స్థాయిని రెండు నుంచి మూడుకి పెంచారు. ఇది విస్ఫోటనం కంటే ముందు రెండో అత్యధిక సాధ్యమైన స్థాయి కావడం గమనార్హం. కాగా, ఇండోనేషియాలో అత్యధిక సంఖ్యలో అగ్నిపర్వతాలు విస్పోటనం చెందుతుంటాయి. గతంలో జరిగిన విస్పోటనాల్లో అనేక మంది ప్రజలు మరణించారు. 

Tags:    

Similar News